Friday, April 19, 2024

ఐటీ రంగంలో మూన్‌లైటింగ్‌ వివాదం.. గిగ్‌ వర్క్‌ను అనుమతించనున్న కంపెనీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఐటీ రంగంలో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది. గడిచిన రెండేళ్లు కొవిడ్‌ సంక్షోభంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిని అమలు చేసిన కంపెనీలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ముగిసి ఇప్పుడిప్పుడే ఆఫీసులకు తిరిగి వస్తున్న ఉద్యోగులు కంపెనీలకు అతి పెద్ద సమస్యను సృష్టించారు. రెండేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో పనిచేస్తుండగానే చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో పనిచేస్తూ వేతనాలు పొందారు.

ఈ సంక్షోభానికి మూన్‌లైటింగ్‌గా ఐటీ పరిశ్రమ పేరు పెట్టింది. దీనికి పరిష్కారమే లేదని, ఎలాంటి విలువలు లేకుండా ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో పనిచేసిన ఉద్యోగులను కొన్ని కంపెనీలు తీసివేస్తున్నాయి. మరో వైపు మూన్‌లైటింగ్‌ తప్పేమీ కాదని, ఉద్యోగులు తమకున్న ఖాళీ సమయంలో మరో కంపెనీకి పనిచేసుకోవడం తప్పేమీ కాదని కొన్ని కంపెనీలు వాదిస్తున్నాయి. ఉద్యోగులు ఈ తరహాలో పార్ట్‌టైం పనిచేసుకోవడాన్ని గిగ్‌ వర్క్‌గా పిలుస్తూ వారికి ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందేనని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ తమ ఉద్యోగులు గిగ్‌ వర్క్‌ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. త్వరలో వారికి ఈ మేరకు అధికారికంగా అనుమతివ్వనున్నామని ప్రకటన చేసింది.

ఉద్యోగులకు సరైన వేతనాల పెంపు లేకే సమస్యలు…
ఐటీ రంగంలో కొన్ని కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించినప్పటికీ కిందిస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఎప్పటికప్పుడు వేతనాలు పెంచకపోవడం వల్లే మూన్‌ లైటింగ్‌ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని పలువురు ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ఐటీ కంపెనీలు గడిచిన దశాబ్దంలో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగుల వేతనాలు పెంచకుండా చాకిరీ చేయించడంతోనే ఉద్యోగులు కొత్తదారులు వెతుక్కుంటున్నారని పలు హెచ్‌ ఆర్‌ కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. ఒక కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీకి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడం ముందు ముందు సర్వసాధారణం కానుందని, దీనికి మూన్‌ లైటింగ్‌ బాటలు వేసిందని కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement