Thursday, April 25, 2024

కమల్ కు షాక్.. ఎన్నికల్లో వెలగని ‘టార్చ్ లైట్’!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్​ కమల్ హాసన్ కు తమిళ ఓటర్లు షాక్ ఇచ్చారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్ ఓడిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన  ఆయన.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1,540 ఓట్ల స్వల్ప మెజార్టీతో కమల్ పై వనతి నెగ్గారు. వనతికి 52,627 ఓట్లు రాగా.. కమల్ కు 51,087 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మయూర ఎస్ జయకుమార్ కు 41,663 ఓట్లు పడ్డాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌ కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచబోనని, సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించారు కమల్. ఫలితంగా విలువలకు కట్టుబడిన వ్యక్తిగా గెలిచిన ఆయన, ఓట్లను పొందడంలో మాత్రం ఓడిపోయారు.

కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement