Friday, March 29, 2024

ఆ పార్టీల్లో కుమ్ములాటలే.. అధికారం అంటూ పగటి కలలు!

కాంగ్రెస్, బీజేపీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వాళ్లకు వాళ్లే తన్నుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని అన్నారు. కాంగ్రెస్ కలహాలు కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు మానడం లేదన్నారు. ఉత్తమ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిందన్నారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రోజురోజుకీ పతనం అవుతోందన్నారు.  ఉనికి కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండి ధాన్యం కొనమని కేంద్రాన్ని  అడిగే దమ్ము లేదన్నారు. తాము కోదాడ, జడ్చర్ల రహదారిని కోట్లడి తెచ్చామన్నారు. రెండు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో  ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించామని చెప్పారు. పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. సీఎం కేసీఆర్ రూ. 1500 కోట్లతో   లిఫ్ట్ లు మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి కనపడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా తన్నుకు చస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందన్న గుత్తా… కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 40 వెల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ స్థానంలో దూసుకుపోతున్నది అని అన్నారు. అధికారం యావ తప్ప కాంగ్రెస్ వాళ్లకు మరో ఎజెండా లేదన్నారు. అధికారంలో రావాలి, దోచుకుతినాలి అన్నదే కాంగ్రెస్ నాయకుల ఆలోచన అని ఆరోపించారు. ప్రజల క్షేమం వారికి పట్టదని మండిపడ్డారు. అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని గుత్తా హెచ్చరించారు.

బీజేపీ పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారయిందని అన్నారు. పార్టీలో గ్రూప్ లుగా ఏర్పడి కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అని గుత్తా జోస్యం చెప్పారు. యూపీలోనూ బీజేపీకి ఎదురుగాలి విస్తున్నదన్న గుత్తా.. జాతీయ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement