Thursday, April 25, 2024

నన్ను బానిస అంటారా ? బిడ్డా ఖబడ్దార్ః టీఆర్ఎస్ కు సీతక్క వార్నింగ్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బానిస రాఖీ కట్టిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. రాఖీ పండగను కూడా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన రాజకీయ జీవితన్నా శంకించే విధంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబుకి 14, 15 ఏళ్ల నుంచి రాఖీ కడుతున్నానని సీతక్క చెప్పారు. తానేమీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక రాఖీ కట్టలేదన్నారు. రాఖీని కూడా నిస్సిగ్గుగా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. పార్టీ మారినందుకో.. ప్రాంతం వేరైనందుకో.. బాబు సీఎం కానందుకో రాఖీ కట్టకుండా ఉండాలనుకునే వ్యక్తిని కాదని సీతక్క స్పష్టం చేశారు. సమాజంలో కొందరు వ్యక్తులతో పరిచయాలు, అనుబంధాలు ఉంటాయన్నారు.

ఈ ఏడాది తాను మూడు రోజులు రాఖీ పండుగ జరుపుకున్నానని.. సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు 500 మందికి రాఖీ కట్టానన్నారు. సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు.. నన్ను బానిస అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సమ్మక్క సారలమ్మ వారసులమని, నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం వారసులమన్నారు. దొరతనాన్ని తరిమికొట్టిన బిడ్డలమని.. బిడ్డా ఖబడ్దార్ అంటూ సీతక్క హెచ్చరించారు. బానిసత్వానికి బడితెపూజ చేశామని.. కోవర్టులను కోసిన చరిత్ర తమదని సీతక్క అన్నారు. ఆ రోజుల్లో నక్సలైట్‌గా ఉన్నా నిబద్ధతతో పనిచేశానని.. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా అంతే పనిచేస్తామని సీతక్క అన్నారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల ఓట్ల కోసం అరికాలికి ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తామని చెప్పిన కేసీఆర్ కల్లబొల్లి మాటలు వద్దన్నారు. నువ్వు, నీ మంత్రులు ఎక్కడ అధికారముంటే అక్కడ జై అంటారు. నీ అధికారం పోగానే నిన్ను కూడా భౌభౌ అంటారని గుర్తు పెట్టుకోవాలని సీతక్క స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండిః దేశంలో కరోనా డెల్టా ప్లస్ దడ.. బయటపడుతున్న కొత్త కేసులు!

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement