Friday, March 29, 2024

ఈటెల అసలు కథ… స్పెషల్ స్టోరీ!

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికార టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారా ? అందుకే ఆయన పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయా? కావాలనే ఈటెల ను టార్గెట్ చేశారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీలో చీలికలు వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. ఈటెల కొత్త పార్టీ పెట్టడం ఖాయం అనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ ​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ ​గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. తన కేబినెట్ లో ముఖ్యమైన పోర్ట్ ఫోలియో చూస్తున్న ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్​ పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది​. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట. టీఆర్​ఎస్​ పార్టీ అధికారిక ఛానల్​గా గుర్తింపు ఉన్న టీ న్యూస్​ లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్​ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది.

గతంలో ‘మేం టీఆర్‌ఎస్‌ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదు’ అని వ్యాఖ్యానించిన ఈటల.. ఈ మధ్య రైతుల ఆందోళన, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని కొంత ఇరుకునపెట్టే విధంగా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైంది. గులాబీ పార్టీల్లో సీనియర్ నాయకుడైన ఈటెల రాజేందర్.. కొంత కాలంగా తనపై సోషల్ మీడియాల్లో, పత్రికల్లో వస్తోన్న వివిధ వార్తలకు ధీటుగా జవాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఎవరో భిక్ష వేస్తే.. రాలేదని.. మేము ప్రజల మనసుల్లోకి వెళ్లి.. ఓట్లను సాధించి తెచ్చుకున్నామని తెలిపారు. ఈ మాటలే టీర్ఎస్ పార్టీలో వేడి పుట్టించాయి. ఈటల రాజేందర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నారనే విమర్శలూ వచ్చాయి. ఇదే క్రమంలో కేసీఆర్‌ స్థానంలో సీఎంగా కేటీఆర్‌ కంటే ఈటల అయితే బాగుంటుందనే వాదనలను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టాలన్న ఉద్దేశం ఉండడం వల్లే మంత్రి ఈటెల స్వరంలో మార్పు వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల కాలంలో మంత్రి ఈటెల రాజేందర్‌ కు సీఎం కేసీఆర్‌కు మధ్య దూరం పెరిగిపోతోంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి ఈటెల హాజరుకాలేదు. అప్పుడే ఈటెల అసంతృప్తిలో ఉన్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. అధినేతకు సమాచారమిచ్చి ఆయన రాలేదా ? లేక అధినేత మాట ఖాతరు చేయలేదా ? అని వివిధ రకాల వార్తలు గుప్పుమన్నాయి.

ఈటెలతోపాటు టీఆర్ఎస్ పార్టీలోని మరికొంత మంది ముఖ్య నేతలు సైతం గులాబీ పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈటెల కొత్త పార్టీలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు కలిసి  కూటమిగా ఓ పార్టీ పెట్టాలనే యోచలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటెల కొత్త పార్టీ పెడితే ఆయన వెంటే నడవాలని ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రలు సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటెలకు ప్రాధాన్యం తగ్గించారనే టాక్ ఉంది. వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలక పదవి ఇచ్చిన కూడా.. ఆయన శాఖలో, పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిందనేది కాదనలేని వాస్తవం.

పదవులు రాగానే కొంతమంది నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరింత ఆజ్యం పోశారు. పదవులు వచ్చింది పార్టీ వల్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన ఆయన.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ ఈటెలతో వార్‌ ను ఓపెన్‌గా డిక్లేర్ చేసినట్లేనన్న మాట వినిపించింది. ఒకవేళ ఈటెల గనుక టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఆయన వెంటే కార్యకర్తలను.. పెద్ద బలగాన్ని కూడా వెంటతీసుకుపోతారు. ఈ విధంగా చూస్తే.. టీఆర్ఎస్ పార్టీ పెద్ద నేతను కోల్పోయినట్టే. అంతేగాక ప్రజల్లో, పార్టీపై చెడు ప్రభావం కూడా పడే ప్రమాదముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement