Thursday, March 28, 2024

ఈవీల నాణ్యత లోపిస్తే భారీ జరిమానా: మంత్రి పువ్వాడ

ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.  ఈ – వాహనాల్లో లోపాలు ఉన్నా, నిర్లక్ష్యం వహించినా తయారీదారులపై భారీ జరిమానా విధించటంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే లోపాలున్న ఎలక్ట్రిక్‌ వాహనాలను కంపెనీలు స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. బ్యాటరీ స్వాపింగ్‌ పాలసీ, బడ్జెట్‌ ఈవీలను కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలు, బ్యాటరీని పరీక్షించేటప్పుడు కచ్చితమైన ప్రమాణాలు వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అజయ్ ఆదేశించారు.

ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్‌ టూవీలర్లు మంటల్లో చిక్కుకుపోతుండటం, ప్రాణనష్టానికీ దారితీస్తున్న నేపథ్యంలో లోపాలున్న వాహనాలను సరిచేసే పనిలో పడాలని ఆయా కంపెనీలను మంత్రి అజయ్ కోరారు. ఈవీలకు తెలంగాణ ఎంతో అనువైన మార్కెట్‌ అని అతి త్వరలోనే ఈవీ హబ్ గా రాష్ట్రం మారబోతుందని మంత్రి అజయ్ వెల్లడించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు ఎక్కువగా ఏం జరగలేదని ప్రస్తుతం ఎండాకాలం కావడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీలకు సమస్యగా పరిణమించాయన్నారు. ఏది ఏమైనా భద్రతకే తొలి ప్రాధాన్యతని వినియోగదారుల రక్షణకు కంపెనీలు పెద్దపీట వేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement