Thursday, March 28, 2024

క్షతగాత్రులకు మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ.. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం

రుయాలో బస్సు ఘటనలో గాయపడిన వారిని మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఉదయం పరామర్శించారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రుయా సూపరిండెంట్ డాక్టర్ భారతి మంత్రికి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీ, జాయిం ట్ కలెక్టర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. క్షతగాత్రులను రుయా,బర్డ్, స్వి మ్స్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. సంఘటన స్థలంలో ఏడుగురు మృతి చెందారని, ఒకరు ఆస్పత్రికి తరలించిన అనంతరం మరణించినట్లు వివరించారు. మిగిలిన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన సీఎం జగన్.. చనిపోయిన వారందరికీ తక్షణ సహాయం కింద రెండు లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. క్షత్రగాతులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆదేశించామన్నారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్ అండ్ బి శాఖ ద్వారా తాత్కాలికంగా రైలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు లైన్ల రోడ్డుకు పదిహేను వందల కోట్లతో టెండర్లు పిలిచినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement