Saturday, April 20, 2024

టీ – డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌.. ఆ సేవలన్నీ ఉచితం

బ‌స్తీ ప్ర‌జ‌ల‌కు వైద్యం అందుబాటులోకి రావాల‌నే ఉద్దేశంతో విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌కు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టార‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని నార్సింగిలో టీ – డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. టీ డ‌యాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ‌స్తీల్లోని నిరుపేద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని 350 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ర‌క్త‌, మూత్ర‌, ఎక్స్‌రేతో పాటు ఇత‌ర ప‌రీక్ష‌ల నిమిత్తం ప్ర‌భుత్వం టీ డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. హైద‌రాబాద్‌లో 20 రేడియోల‌జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి హరీష్… ఈ రేడియోల‌జీ ల్యాబ్ నార్సింగ్‌లో ప్రారంభించుకున్నట్లు చెప్పారు. ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకో, మెమోగ్ర‌ఫీ సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు. టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో ఉచితంగా 57 ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్‌లో టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో 137 ప‌రీక్ష‌లు అందుబాటులోకి తీసుకొస్తామ‌మని వెల్లడించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనే కిడ్నీ, లివ‌ర్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స‌ల‌తో పాటు ఉచితంగా మోకాళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ అందిస్తున్నామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement