Friday, April 19, 2024

ఏపీలో రికార్డు స్థాయిలో నేడు మెగా వ్యాక్సినేషన్

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఆదివారం రికార్డుస్థాయిలో టీకాలను వేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆదేశాలతో ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అత్యధికంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున.. మిగతా జిల్లాలకు 50- 70 వేల మధ్య డోస్‌లను పంపారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులు రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది ఉండగా.. శనివారం వరకు వీరిలో 28% మంది తొలి డోస్ వేయించుకున్నారు.

మిగతావారిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. అలాగే 45 ఏళ్లు బడిన వారికి తొలి టీకా వేస్తారు. రెండో డోసుకు అర్హత కలిగిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశాన్ని వీలైనంత వరకు కల్పించాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కో జిల్లాలో కనీసం 500 వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అంతకంటే ఎక్కువ మందికి టీకా పంపిణీ చేసినట్లయితే…కేంద్రం నుంచి అధిక సంఖ్యలో డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం దాదాపుగా కొవిషీల్డ్‌ టీకానే వేయనున్నారు. 80వేల వరకు మాత్రమే కొవాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వ‌ర‌కు రెండు సార్లు ఒక్కరోజులో 6 ల‌క్షల కరోనా వాక్సిన్‌ డోస్‌లను వైద్య ఆరోగ్యశాఖ‌ అందించింది. ఈ రికార్డులు బద్ధలు కొట్టేలా ఒకేసారి 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు అంతా సిద్ధం చేసింది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement