Friday, March 29, 2024

శ్మశానంలో ఆన్‌లైన్ పాఠాలు… వైద్య విద్యార్థిని అవస్థలు

కరోనా కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడడంతో చదువులన్నీ ఆన్ లైన్ లోనే సాగుతున్నాయి. ఉపాధ్యాయులు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధన చేస్తున్నారు. అయితే, ఆన్ లైన్ క్లాసులు నగరాలు, పట్టణాల్లో ఉండే విద్యార్థులకు బాగానే ఉన్నా పల్లెటూళ్లలో ఉండేవారికి మాత్రం సెల్‌ ఫోన్ సిగ్నల్స్ లేక చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో ఓ వైద్య విద్యార్థిని ఏకంగా శ్మశానంలో చదువుకుంటూ.. సమాధుల మధ్య ఆన్‌ లైన్ క్లాసులు వింటున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. అయితే ఆ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో కల్పన తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆమె పరిస్థితిని గమనించిన కొందరు శ్మశానం దగ్గర సెల్‌ఫోన్ సిగ్నల్ బాగా వస్తుందని చెప్పడంతో అక్కడికి వెళ్లి పరిశీలించింది. అక్కడ సిగ్నల్స్ బాగా వస్తుండటంతో నిత్యం శ్మశానానికి వెళ్లి ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. తమ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉందని, గతేడాది కూడా కుటుంబసభ్యుల సహకారంతో శ్మశానవాటికలోనే ఆన్‌లైన్ పాఠాలు విన్నానని కల్పన తెలిపింది. తనలాంటి వారి సమస్యలు తీరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కల్పన కోరుతోంది.

ఇది కూడా చదవండిః తెలంగాణ సర్కారుకు షాక్.. ప్రత్యక్ష విద్యాబోధనపై హైకోర్టులో పిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement