Saturday, April 20, 2024

తల్లి సంరక్షణలో పెరిగిన పిల్లలకు తల్లి తరఫు కులం వర్తిస్తుంది.. స్పష్టంచేసిన బాంబే హైకోర్టు

తల్లిదండ్రులు విడిపోయినప్పుడు, తల్లి సంరక్షణలో పెరిగిన పిల్లలకు తల్లి కులం స్వీకరించే అవకాశాలను పరిశీలించాలని బాంబే హైకోర్టు ఇవ్వాల పేర్కొంది. ఒంటరి మహిళ సంరక్షణలో పెరిగిన ఓ 20 ఏళ్ల యువతి తన తల్లి కులాన్ని స్వీకరించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ కేసులో కులాల పరిశీలన కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టిన హైకోర్టు.. ఈ కేసును కొత్తగా పరిశీలించాల్సిందిగా ప్యానెల్‌ను కోరింది. పిటిషనర్ మహర్ షెడ్యూల్డ్ కులానికి చెందిన ఆమె తల్లి ద్వారా దాదాపు పూర్తిగా ఒంటరిగా పెరిగారు. మహిళ తల్లిదండ్రులు 1993 ఏప్రిల్ 25న వివాహం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారి మధ్య వివాదాలు చెలరేగాయి. ఈ దంపతులు తమ విభేదాలను చక్కబెట్టుకోలేక పోయారు. దీంతో 2009 నవంబర్ లో వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే 2002 ఆగస్ట్ లో జన్మించిన పిటిషనర్ విడాకులు తీసుకునే నాటికి తనకు దాదాపు 7 సంవత్సరాల వయస్సుందని, అప్పటి నుండి తల్లి వద్ద పెరిగినట్టు కోర్టుకు వెల్లడించారు.

రికార్డుల ప్రకారం విడాకులకు ముందు కూడా పిటిషనర్‌ను ఆమె తల్లి చూసుకుంది. విజిలెన్స్ విచారణ అధికారి ఆ మహిళ తండ్రి తన ఇద్దరు పిల్లలను ఎప్పుడూ పట్టించుకోలేదని, వారి తండ్రి తరపు బంధువుల వద్దకు తన పిల్లలను తీసుకెళ్లలేదని కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌తో సహా పిల్లలు తమ తండ్రి తరపు బంధువులను ఎవరూ గుర్తించలేదని విజిలెన్స్ అధికారి పేర్కొన్నారు. పిటిషనర్‌ను మొదటి తరగతిలో పాఠశాలలో చేర్చినప్పుడు ఆమె తల్లి తన కులాన్ని మహర్‌గా సమర్పించిందని కూడా అతను వివరించాడు. పిల్లల తాత మహర్ కుల ఆచారాలు, సంప్రదాయాలు, అభ్యాసాలను అనుసరిస్తారని అధికారి చెప్పారు. మహర్ కులానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో మహిళ పెరిగి పెద్దదైందని సాక్ష్యాధారాలు చెబుతున్నాయని కోర్టు పేర్కొంది. “ఈ సాక్ష్యం కచ్చితంగా మహిళ మహర్ కులానికి చెందినదిగా దావా వేయడానికి అర్హత కలిగిస్తుంది అని జస్టిస్‌లు ఎస్‌బీ శుక్రే, జీఏ సనప్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆ మహిళ కూడా తన తల్లికి చెందిన వెనుకబాటుతనానికి గురవుతోందని, తండ్రికి బదులు తల్లి కులాన్ని స్వీకరించే హక్కు ఆమెకు ఉందని ఆమె నేపథ్యం తెలియజేస్తుందని కోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement