Thursday, August 5, 2021

ఈటలపై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ

మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ పై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ విడుదల చేసింది. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ.. కేసిఆర్ కు వ్యతిరేకంగా పోరాడ‌తాన‌ని చెప్పాడని.. కాని దానికి విరుద్దంగా హిందుత్వ పార్టీ బీజేపీలో చేరారని మండిపడింది.

ఈటలపై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ

ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. దీంతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో అన్నారు. కేసీఆర్, ఈటల ఒకే గూటి పక్షులని జగన్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని ఆరోపించారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదన్నారు.

మొన్నటి వరకూ కేసీఆర్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల.. తన ఆస్తుల పెంపుదలకు యత్నించారని జగన్ ఆరోపించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారని తెలిపారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరారని విమర్శించారు. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.  మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని లేఖలో జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News