Thursday, March 28, 2024

నేడే సీఎంగా దీదీ ప్రమాణం..

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బెంగాల్ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది. అతి తక్కువ మంది దీదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కొందరు నేతలకే ఆహ్వానాలు పంపించారు. మమత మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి కొద్దిమంది సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారు.

బెంగాల్​ లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుకు గానూ 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లు, బీజేపీ 77 సీట్లు, ఇతరులు 2 సీట్లు గెలుచుకున్నారు. అయితే, మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను సోమవారం ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తగా 1970వ దశకంలో రాజకీయంలోకి ప్రవేశించిన మమతా బెనర్జీ.. అనతికాలంలోనే మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ స్థాయికి ఎదిగారు. జగదేవ్‌ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984లో కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. అది కమ్యూనిస్టుల కోట. అయితే, దీదీ మాత్రం సీపీఎం దిగ్గజ నేత సోమనాథ్ ఛటర్జీని ఓడించారు. 1984లో పిన్నవయస్సులోనే పార్లమెంటరీలోకి ప్రవేశించారు. తర్వాత 1991, 96, 98,99,2004 జనరల్ ఎలక్షన్స్‌లో విజయం సాధించారు. బొగ్గు గనులు, రైల్వే శాఖల బాధ్యతలు చేపట్టారు. 1997లో బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోమేంద్ర నాథ్ మిత్రతో అభిప్రాయబేధాలు ఏర్పడి, పార్టీ వీడి ముకుల్ రాయ్‌తో కలిసి 1998 జనవరిలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు.

పార్టీని నెలకొల్పిన వెంటనే రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షంగా అవతరించింది. 2011లో పార్టీని అధికారంలోకి వచ్చింది. ప్రజా పోరాటాల్లో చురుకుగా పాల్గొని 2011 మే 13న దీదీ బెంగాల్ సీఎం అయ్యారు. మూడు దశాబ్దాల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి దీదీ చుక్కలు చూపించారు. సీపీఎంను రాష్ట్రంలో మట్టికరిపించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. దశాబ్దకాలం తర్వాత ఆ పార్టీని రాష్ట్రంలో దాదాపుగా తుడిచేసినంత పనిచేశారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలనూ దీటుగా ఎదుర్కొని తనకు సవాలే కాదన్న పరిస్థితికి నెట్టేశారు. దీదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను సాధించుకోలేకపోవడం గమనార్హం. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేరు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు, ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ ముఖ్య నేతలు కలిసి బెంగాల్‌లో ప్రచారం చేసినా, దీదీ సింగిల్ హ్యాండ్‌ తో హ్యాండిల్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. దీదీ గత పదేళ్ల పాలనతో తాము సంతృప్తిగా ఉన్నామని బెంగాల్ ఓటర్లు తీర్పు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement