Saturday, April 20, 2024

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్

సీబీఐకి డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుభోద్ కుమార్ జైస్వాల్ ఎంపికయ్యారు. ఆయనను సీబీఐ చీఫ్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది. ధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. 

నిజానికి సీబీఐ నూతన డైరెక్టర్ పదవి రేసులో సుబోధ్ కుమార్ ముందు నుంచి ఉన్నారు. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది కూడా పోటీలో నిలిచినప్పటికీ సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడంతో ఆయనకే ఈ పదవి దక్కింది. డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సీబీఐ అదనపు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నాలుగు నెలల ముందుగానే కమిటీ సమావేశమై సీబీఐ కొత్త డైరెక్టర్‌ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆలస్యమైంది. జైస్వాల్ మహారాష్ట్ర కేడర్ 1985 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇంతకుముందు ముంబై పోలీసు కమిషనర్, మహారాష్ట్ర డిజిపి పదవులను నిర్వహించారు. అతను కేంద్ర పదవులను నిర్వహించాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) లలో సుదీర్ఘకాలం పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement