Wednesday, April 24, 2024

Alert: తెలంగాణలో చలిపులి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలోని అర్లి(టి)లో అత్యల్పంగా 6, ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తగ్గుతాయని ప్రకటించింది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో సైతం చలి తీవ్రత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో రాబోయే మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు విశాఖపట్నంలో తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement