Thursday, April 25, 2024

31నుంచి ఆంక్షల్లేవ్‌, కొవిడ్‌ మార్గదర్శకాల ఎత్తివేత.. కానీ మాస్క్ మస్ట్​

న్యూఢిల్లీకోవిడ్‌ -19 మహమ్మారి తలెత్తిన తరువాత దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఆంక్షలను మార్చి 31నుంచి ఎత్తివేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే మాస్క్‌ల వాడకం మాత్రం తప్పనిసరి అని సూచించింది. చైనా, ద.కొరియా, అమెరికా, జర్మనీ, వియత్నాం, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో ఒమిక్రాన్‌ కొత్త ఉత్పరివర్తనాలు బీఏ1, బీఏ2 వ్యాపిస్తూ నాలుగో వేవ్‌ సూచనలు కన్పిస్తున్నప్పటికీ, దేశంలో గణనీయంగా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటన చేసింది. ఈ మేరకు బుధవారంనాడు కేంద్ర హోంశాఖ స్పష్టమైన సూచనలు చేసింది. దేశంలో కరోనా ఉధృతి పెరిగిన తరువాత విపత్తుల నిర్వహణ చట్టం మేరకు కేంద్రప్రభుత్వం కోవిడ్‌ -19 మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కొన్ని జాగ్రత్తలను సూచిస్తూ భౌతికదూరం పాటించాలని సూచించడం, కేసులు ఎక్కువగా ఉన్నప్రాంతాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు ప్రకటించడంవంటి చర్యలు తీసుకుంది. తరువాత షాపింగ్‌ మాల్స్‌, విద్యాసంస్థలు వంటివి దశలవారీగా తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. కాగా దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలను అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని, అందువల్ల మార్చి 31నుంచి ఎత్తివేయనున్నట్లు హోంశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అత్యంత సమర్ధంగా, వేగంగా కొనసాగడంతో దేశంలో కోవిడ్‌ తీవ్రత పెద్దగా లేదు.

తగ్గిన వ్యాప్తి
దేశంలో కరోనా ప్రభావం తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 1778 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసులలో కేవలం 0.06 శాతం (23,087) యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు కోలుకుంటున్నవారి శాతం 98.74 శాతంకాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.28గా ఉంది. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లిd విజృంభిస్తున్నప్పటికీ దేశంలో మాత్రం నియంత్రణలోనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement