Saturday, April 20, 2024

రేపటి దాకా వెయిట్ చేద్దాం.. ఆ తర్వాత ఎండగడదాం!

ప్ర‌భ‌న్యూస్ : తెలంగాణ రైతుల పట్ల, ప్రజల పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని, వరి ధాన్యం కొనుగోలు, నీటి వాటాల ఖరారు, విభజన చట్టంలోని ఇతర హామీల అమలుపై ఢిల్లి సర్కారుతో అమీ తుమీ తేల్చుకుంటామని హస్తినకు వెళ్లిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ అనూహ్యరీతిలో ఎవరినీ కలవకుండానే హైదరాబాద్‌ తిరిగొచ్చారు. వరి పంట విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన ఈనెల 26న కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీ అనంతరం, తేలిన లెక్కలు.. ముందు పెట్టుకుని రాష్ట్ర రైతులకు అప్పీల్‌ చేయనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం జరిపిన చర్చల్లో పారాబాయిల్డ్‌ రైస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని, అది ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పిన దరిమిలా.. సీఎం ముందునుండే తాను ఏం చెప్పానో అదే జరిగిందని, బీజేపీని.. కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని సీఎం అవలంభిస్తారని చెబుతున్నారు. ధాన్యం కొను గోళ్ళకు సంబంధించి మళ్ళీ అదే సమాధానం రావడం, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అందుబాటులో లేకపోవడంతో.. ఢిల్లిలో ఉండడం వల్ల లాభం లేదని సీఎం భావించినట్లు తెలుస్తోంది.

దీనికి తోడు అఖిల భారత రైతు ఉద్యమ నేతలు హైదరాబాద్‌లో మహాధర్నాకు పూనుకోగా, టికాయత్‌ తదితరులు సీఎంను ఇప్పటికే అభినందించారు. బియ్యం కొనుగోలుపై 26న క్లారిటీ ఇస్తామని కేంద్ర మంత్రులు చెప్పడంతో ఆ మీటింగ్‌కు మంత్రులను హాజరుకావాలని సూచించి సీఎం తిరిగొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం.. తెలంగాణను ఎంతగా విస్మరిస్తే టీఆర్‌ఎస్‌కు అంత లబ్ధి చేకూరుతుందని టీఆర్‌ఎస్‌ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రానికి క్లారిటీ లేదని గ్రహించే, ఇక్కడి బీజేపీ నేతలను తుత్తునీయలు చేసే పథకంలో భాగంగానే ఢిల్లి పర్యటనకు వెళ్లినట్లు వాదనలున్నాయి. తెలంగాణలో బీజేపీని నిలువరించేలా తన ఢిల్లి పర్యటన అంశాలను సీఎం కేసీఆర్‌ ప్రజలకు వివరిస్తారని, ధాన్యం కొనుగోలుపై కేంద్రం క్లారిటీ ఇవ్వకపోవడాన్ని బలంగా ప్రచారం చేయబోతున్నారని, అదే సమయంలో ప్రత్యామ్నాయ పంటలపైనా సీఎం నిర్ణయాలు వెలువరిస్తారని అధికార టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

సీఎం తర్వాత అడుగులపై టీఆర్‌ఎస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌ బైపోల్‌ తర్వాత వరుస ప్రెస్‌మీట్లతో.. పొలిటికల్‌ హీట్‌ పుట్టించిన సీఎం కేసీఆర్‌ ధాన్యం ధర్నాలు, మహాధర్నా, ఢిల్లి యాత్రతో దీనిని పతాకస్థాయికి తీసుకెళ్ళారు. రైతు చట్టాలపై పోరులో మృతిచెందిన రైతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సీఎం పరిహారం ప్రకటించడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించగా, కేంద్రం సాగుచట్టాలు కూడా రద్దుచేయడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ నింపింది. కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తూనే.. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వంపై ఉన్న భరోసాను కొనసాగించేలా సీఎం వ్యూహాలు ఉంటాయని ముఖ్యనేతలు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement