Thursday, April 18, 2024

ఊళ్లోకి వచ్చి ఆగమాగం చేసింది.. రైతులపై దాడి చేసిన చిరుత.. బంధించిన ఫారెస్ట్​ సిబ్బంది

దారితప్పి అడవిలోనుంచి జనారణ్యంలోకి వచ్చిందో చిరుతపులి.  తొలుత పొలం పనులకు వెళ్లిన వారిని గాయపరిచింది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్​ అధికారులు ప్రత్యేక బృందాలతో వచ్చి వలపన్ని పట్టుకోవాలని చూశారు. అయినా వారి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసింది. దానికి మత్తు ఇంజక్షన్లున్న బాణాలు వేసి స్పృహ తప్పేలా చేసి ఎట్టకేలకు పట్టుకున్నారు..

తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఓ చిరుత పులి దారితప్పి పొలాల్లోకి వచ్చింది. ఇద్దరు రైతులతో సహా ఏడుగురిపై దాడి చేసి గాయపరిచింది. ఈ చిరుతను గురువారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఊళ్లోకి వచ్చి పొలాల సమీపంలో వరదరాజన్,  మారన్ అనే ఇద్దరు రైతులపై దాడి చేసింది. వారిని కాపాడేందుకు వెళ్లిన  వారిలో మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. 60 ఏళ్ల వరదరాజన్ మొన్న తెల్లవారుజామున తన పొలానికి వెళ్లినప్పుడు చిరుత అతనిపైకి దూసుకొచ్చింది..  అతని భుజంపై పంజాతో కొట్టి గాయపరిచింది. అతడిని కాపాడేందుకు వచ్చిన వారిపైనా దాడిచేసింది. దీంతో వారంతా సమీపం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, పులిని పట్టుకుని బోనులో పెట్టే క్రమంలో అటవీ శాఖ అధికారికి కూడా గాయాలయ్యాయి.

చిరుతపులి సంచారాన్ని పర్యవేక్షించేందుకు అధికారులు 10 నిఘా కెమెరాలను ఉంచారు.  చీకటిలో ఒంటరిగా వెళ్లవద్దని ఆ గ్రామా ప్రజలను కోరారు. అమ్మపాళ్యం సమీపంలో చిరుతను గుర్తించగా దానిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీ అధికారులపై కూడా దాడి చేసింది.  తిరుప్పూర్ పట్టణంలోకి దారితప్పిన చిరుతపులికి మత్తు ఇచ్చాం. దానికి అవసరమైన అన్ని వైద్య పరీక్షల తర్వాత విడిచిపెట్టే ప్రదేశాన్ని  త్వరలో నిర్ణయిస్తాం అని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఆనమలై అడవుల్లో చిరుతను వదలాలని అటవీశాఖ అధికారులు యోచిస్తున్నారు. డిపార్ట్ మెంట్ దాదాపు 50 మంది సిబ్బందిని మోహరించింది. ఇందులో యాంటీ -పోచింగ్ స్క్వాడ్‌లు ఉన్నాయి.

https://twitter.com/CWLWTN/status/1486612445867114497
Advertisement

తాజా వార్తలు

Advertisement