Friday, April 19, 2024

సాగర్ సంగ్రామం.. నేడే ఫైనల్!

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలుపుపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు సమయం ఉండనుంది. సాగర్ ఉప ఎన్నికలో ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోఉండగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల సస్పెన్స్‌ వీడింది. టీఆర్‌ఎస్‌ భగత్‌ని అభ్యర్థిగా ప్రకటించిన కొన్ని గంటలకే… డాక్టర్‌ రవికుమార్‌ పేరును ప్రకటించింది బీజేపీ. సాగర్‌ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌కు రెడీ అయ్యారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడు తుది గడువు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా ఇతరులూ పెద్ద సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ నాయక్ సహా… వివిధ పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఉదయం 11 గంటలకు నామినేషన్ అందజేయనుండగా… మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్ రెడ్డి హాజరు కానున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేస్తారని.. పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీలో అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొన్న దృష్ట్యా చివరకు టికెట్ దక్కించుకున్న రవికుమార్ నాయక్.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు. బీజేపీ నుంచి రెబల్ అభ్యర్థిగా కడారి అంజయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని వ్యూహాత్మకంగా చివరిదాకా ప్రకటించలేదు. నోముల భగత్‌తో పాటు టికెట్‌కోసం పోటీపడ్డ కోటిరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ భవన్‌కి రావటంతో చివరిదాకా టికెట్‌ ఎవరికనే ఉత్కంఠ కొనసాగింది. చివరికి సామాజిక సమీకరణాలకు తోడు…సెంటిమెంట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని నోముల కుమారుడికే అవకాశమిచ్చారు సీఎం కేసీఆర్. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సాగర్‌లో భగత్‌ విజయానికి సహకరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌. నేతలంతా తనకు సహకరిస్తారనే నమ్మకంతో ఉన్నారు.

- Advertisement -

మరోవైపు ఇప్పటికే హాలియా సభతో ప్రచారాన్ని ఉధృతం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి… ఇవాళ నామినేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే టీపీసీసీ ముఖ్యనేతలు ప్రచారంలో జానాకి దూకపోతున్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించేదాకా వ్యూహాత్మకంగా వేచి చూసిన బీజేపీ… డాక్టర్‌ పనుగోతు రవికుమార్‌ని సాగర్‌ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, టికెట్‌పై నమ్మకంతో ముందే నామినేషన్‌ వేశారు కంకణాల నివేదిత. ఆమెతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. రవికుమార్‌ నామినేషన్‌ పూర్తయ్యాక.. టికెట్‌ ఆశించిన నేతల్ని బుజ్జగించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఏప్రిల్ 17న సాగర్ కు ఉపఎన్నిక జరుగనుండగా… మే 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement