Thursday, April 25, 2024

గులాబీ గూటికి ఎల్.రమణ..! కొత్త తమ్ముడు ఎవరు..?

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారా?… ఇప్పుడీ అంశమే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గ నాయకుడైన ఈటలపై వేటుతో ఏర్పడిన శూన్యాన్ని ఎల్.రమణతో భర్తీ చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు ఎల్.రమణ త్వరంలోనే గులాబీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఇపుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏడేళ్ల నుంచి తెలంగాణలో ఒక్కరే పార్టీ అధ్యక్షుడు ఉండటంతో.. అధ్యక్షుడిగా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లటంలో పూర్తిగా విఫలం అవ్వటంతో పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే మాట వాస్తవం.

బయటకి చెప్పలేకపోయినా కార్యకర్తలు అందరూ అధ్యక్షుడి మార్పుని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.రాజకీయంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇది ప్రధాన సమస్యగా మారిపోయింది. గత రెండు రోజుల నుంచి ఎల్.రమణ పార్టీ మార్పు వార్తలు ఆ పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పెద్ ఎత్తున వార్తలు గుప్పుమంటున్నా.. ఇంతవరకు ఆయన ఖండించకపోవటంతో ఆయన పార్టీ మారటం కేవలం లాంఛనమే అన్న అభిప్రాయానికి కార్యకర్తలు వచ్చారు.

ఇక టిడిపి క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా సరే.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం పార్టీ నాయకత్వం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం పలు సమస్యలకు పురుడు పోతోంది. అయితే ఇప్పుడు ఎల్.రమణ పార్టీని వీడితే రాబోయే రోజుల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఇలా తెలంగాణ టీడీపీలో సీనియర్ నాయకుల్లో ముందు వరసలో నిలిచేది మాత్రం నన్నూరి నర్సిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ వంటి నేతలు. వీరంతా రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే అంగీకరించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నర్సిరెడ్డి మంచి వక్త కూడా కావడంతో పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా అన్ని పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూండటం నర్సిరెడ్డి వైపే పార్టీ నాయకత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement