Monday, May 17, 2021

ఉద్యమకారులారా ఏకమవుదాం.. కేసీఆర్ ను గద్దె దింపుదాం: కోదండరాం పిలుపు

తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ భూముల‌ను కాజేశారంటూ వచ్చిన ఆరోప‌ణ‌లపై తెలంగాణ జన స‌మితి అధ్య‌క్షుడు, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్య‌మ నేత‌ల‌ను ఒక్కొక్క‌రిని రాజకీయంగా అంతమొందించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని కోదండ‌రాం ఆరోపించారు. ప్ర‌త్య‌ర్థుల‌ను లొంగ‌దీసుకోవ‌డానికే తెలంగాణ‌లో భూవివాదాల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నార‌ని వ్యాఖ్యానించారు.  తెలంగాణ‌లో క‌రోనా ఉద్ధృతి పెరిగిపోతోన్న నేప‌థ్యంలో దాని నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించడానికే ఈట‌ల వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని మండిపడ్డారు. ఈట‌ల భూముల సంగ‌తి స‌రే మ‌రీ కేటీఆర్ భూముల సంగ‌తేంట‌ని? ఆయన కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. ‘’కేటీఆర్ కు ఒక న్యాయం… ఈటలకు ఒక న్యాయ‌మా?. అక్ర‌మంగా కేటీఆర్ జ‌న్వాడ ఫాంహౌజ్ నిర్మించ‌లేదా… భూ ఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌లున్న మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్,ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, ముత్తిరెడ్డి, గొంగిడి సునీత‌లపై చర్యలు ఏవి’’ అని కోదండ‌రాం నిల‌దీశారు. ఒక వర్గం మీడియా ప్రభుత్వానికి బానిసగా మారిందని కోదండరాం ఆరోపించారు.

హ‌ఫీజ్‌పేట్, మియాపూర్ భూముల‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని కోదండరాం డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌పై మంత్రి ఈట‌ల గ‌ట్టిగా మాట్లాడినందుకే విచార‌ణ‌కు ఆదేశించార‌ని చెప్పారు. ఈ కార‌ణాల వ‌ల్లే సీఎం కేసీఆర్ ఇలా రెచ్చిపోతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. భూరికార్డుల ప్ర‌క్షాళ‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ఈట‌ల‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, మ‌ల్లారెడ్డి , టీఆర్ఎస్ నేత‌లు ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మ‌హిపాల్ రెడ్డిపై కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఉద్య‌మ‌కారులంతా ఏకం అవ్వాల‌ని, కేసీఆర్ ను గ‌ద్దె దింపాల‌ని కోదండరాం పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News