Friday, March 29, 2024

ఈ గవర్నెన్స్​ డ్యాష్​బోర్డు సిస్టమ్​లో గుజరాత్​ మోడల్​​.. అధ్యయనం చేయనున్న కేరళ

ఇ గవర్నెన్స్​కు సంబంధించిన డ్యాష్​బోర్డ్​ సిస్టమ్​పై కేరళ సర్కారు గుజరాత్​ మోడల్​పై అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపి జాయ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బృందాన్ని మూడు రోజుల పాటు గుజరాత్‌కు పంపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో ప్రారంభించిన డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను అధ్యయనం చేయాలని కేరళ నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ పథకాల అమలును జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారులను మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యంగా కేరళ ప్రభుత్వం చెబుతోంది.

ఇలా చేస్తే ప్రభుత్వ పథకాల అమలు, శాఖల పనితీరును ముఖ్యమంత్రి నేరుగా విశ్లేషణ చేయొచ్చు. రూపొందించిన డేటాబేస్ ఆధారంగా సీఎం డ్యాష్‌బోర్డ్ ద్వారా డిపార్ట్ మెంట్ల పనితీరును రోజూ సమీక్షించవచ్చు. ప్రతి వర్గానికి స్టార్ రేటింగ్ కూడా ఇవ్వవచ్చు. సివిల్ సర్వీస్‌లో ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావడమే దీని లక్ష్యం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మధ్య జరిగిన భేటీలో కూడా ‘గుజరాత్ మోడల్’ గురించి చర్చ జరిగింది. కేరళకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవస్థపై అధ్యయనం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీని ఆధారంగా చీఫ్ సెక్రటరీ వీపీ జాయ్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ఇన్ చార్జి స్టాఫ్ ఆఫీసర్ ఉమేష్ ఐఏఎస్  రేపు గుజరాత్ వెళ్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ అధికారులతో చర్చించి వారం రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్, వామపక్షాలు నిరంతరం విమర్శిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో కేరళ చీఫ్ సెక్రటరీ పర్యటన జరగడం గమనార్హం. గుజరాత్ మోడల్‌ను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను కాంగ్రెస్ విమర్శించింది. కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌ ప్రభుత్వంతో కేరళ ప్రభుత్వం సంబంధాలు నెరపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గుజరాత్ మోడల్ సరైన నమూనా అని ఈ చర్య రుజువు చేస్తోందని బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement