Saturday, April 20, 2024

Humanity: హైకోర్టు జడ్జిని కదిలించిన ఘటన.. చంటిబిడ్డకు చనుబాలిచ్చిన కానిస్టేబుల్​ ఔదార్యం

కేరళ రాష్ట్రం కోజికోడ్​ చేవాయూర్​ పోలీస్​ స్టేషన్​లో మహిళా కానిస్టేబుల్​గా పనిచేస్తున్న రమ్యను ఇప్పుడు యావత్​ రాష్ట్రం పొగడ్తలతో ముంచెత్తుతోంది. మొన్న పోలీసు స్టేషన్​కి వచ్చిన ఓ కేసులో రమ్య తన మాతృత్వపు మాధుర్యాన్ని కనబరిచారు. ఈ కేసులో భాగంగా తల్లి నుండి విడిపోయిన శిశువుకు చనుబాలిచ్చి కాపాడిన విషయంలో ఏకంగా హైకోర్టు జడ్జి ముగ్ధులయ్యారు.  రమ్యను కేరళ పోలీసు చీఫ్ అనిల్ కాంత్ ఇవ్వాల (సోమవారం) సత్కరించారు. అంతేకాకుండా ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వేవన్​ రామచంద్రన్​ ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేరళ రాష్ట్రం కోజికోడ్ చెవాయూర్ పోలీస్ స్టేషన్ సివిల్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు ఎంఆర్ రమ్య, ఆమె కుటుంబ సభ్యులను పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో సత్కరించారు పోలీసు డిపార్ట్​మెంట్​ చీఫ్​ అనిల్​ కాంత్​. ఆకలితో అలమటిస్తున్న ఓ పసికందు పట్ల సానుభూతితో వ్యవహరించి,  పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని పోలీసు ఉన్నతాధికారి పొగడ్తలతో ముంచెత్తారు.

ఆమె సేవకు ముగ్ధుడై.. ఆకలితో అలమటిస్తున్న పసికందును సొంత తల్లిలా ఆదరించి చనుబాలు ఇచ్చినందుకు ఆమె చేసిన సహజత్వాన్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్, ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. ఆమెకు జడ్జి సర్టిఫికేట్‌ను కూడా పోలీసు చీఫ్ అందించారు. సర్టిఫికేట్‌లో ఆమె పోలీస్ ఫోర్స్ యొక్క బెస్ట్​గా ఉందని పేర్కొన్నారు.

శనివారం ఉదయం 22 ఏళ్ల మహిళ తన బిడ్డ కనిపించడం లేదని చెవాయూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కుటుంబ కలహాల కారణంగా పసికందును తల్లి నుంచి భర్త తీసుకెళ్లాడు. పసికందుని తండ్రి తీసుకెళ్లి ఉండవచ్చనే సమాచారంతో వాయనాడ్ సరిహద్దులోని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. సుల్తాన్ బతేరి పోలీసులు సరిహద్దు వెంబడి వాహనాలను తనిఖీ చేస్తుండగా శిశువుతో ప్రయాణిస్తున్న తండ్రిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

కాగా, ఆకలితో అలసిపోయిన నవజాత శిశువును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పసికందులో షుగర్​ లెవల్స్​ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. కాగా, కేసులో భాగంగా ఆసుపత్రికి చేరుకున్న రమ్య.. తాను పాలిచ్చే తల్లీ అని డాక్టర్లకు తెలియజేసి పసిపాపకు చనుబాలు పట్టించారు. ఆ రోజు సాయంత్రమే శిశువుని తల్లికి అప్పజెప్పారు.

ఎంఆర్​  రమ్య కోజికోడ్‌లోని చింగాపురం స్థానికురాలు. నాలుగేళ్ల క్రితం పోలీసు శాఖలో చేరింది. ఆమె మహిళా బెటాలియన్‌లోని రెండో బ్యాచ్‌లో శిక్షణ పూర్తి చేసి సాయుధ పోలీసు బెటాలియన్‌లోని నాలుగో స్క్వాడ్‌లో పనిచేసింది. ప్రసూతి సెలవు తర్వాత ఆమె చెవాయూర్ పోలీస్ స్టేషన్‌లో చేరారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రమ్య పాఠశాల ఉపాధ్యాయుడు అయిన అశ్వంత్ వైశ్వన్​కు భార్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement