Saturday, April 20, 2024

ద‌ళ‌ప‌తి వ్యూహం – హ్యాట్రిక్ ల‌క్ష్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆ దిశలోనే పావులు కదుపుతున్నారు. ఎత్తుగడలు, వ్యూహరచనతో ప్రత్యర్థులను కకావికలం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీలకు డబుల్‌ డిజిట్‌ సీట్లు కూడా దక్కకుండా చేయాలనే లక్ష్యంతో పక్కా స్కెచ్‌ వేస్తారని తెలిసిందే. తన సొంత సర్వేతో పాటు ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్యాంచ్‌ సర్వేలు కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే నివేదికలు సమర్పించినప్పటికీ, పొంగిపోక మెజారిటీ ఓట్లున్న సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన వర్గాలను కాపాడుకుంటూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే విషయమై ఇప్పటికే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు బ్యాంక్‌గా ఉన్న మైనారిటీలు పక్కకు జరగకుండా వారి సంక్షేమానికి భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం)కి పెట్టనికోటగా ఉన్న విషయం తెలిసిందే. మజ్లిస్‌ను తమ పార్టీగానే ముస్లింలు నమ్ముతారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్‌తో స్నేహం ఉంటే సరి… మరి వికటిస్తే పరిస్థితేంటి? హైదరాబాద్‌ నగరంలో తప్ప మిగతా పట్టణాలు, నగరాల్లో మైనారిటీ వాడలు బీఆర్‌ఎస్‌ కంచుకోటలుగానే ఉన్నాయి. అందుకు జిల్లాల్లో మజ్లిస్‌ పోటీ చేయకపోవడమే ఒక కారణం. ఒకప్పుడు మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో గత రెండు శాసనసభ ఎన్నికల్లో కూడా ముస్లింలతో పాటు క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ ఓటర్లు బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు.

ప్రస్తుతానికి మజ్లిస్‌తో బీఆర్‌ఎస్‌కు మైత్రి కొనసాగుతున్న ప్పటికీ, ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది? జాతీయ పార్టీగా గుర్తింపు కోసం తహతహలాడుతూ దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న మజ్లిస్‌ గతంలో మాదిరిగానే పాతబస్తీకే పరిమితమవుతుందా? రానున్న ఎన్నికల్లో ఓల్డ్‌ సిటీ దాటి బయటకు వస్తుందా? వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వస్తామని మజ్లిస్‌ పక్ష నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ శాసనసభలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటారా? శాసనసభలో చేసిన సంచలన ప్రకటనను మజ్లిస్‌ వెనక్కు తీసుకున్నట్లేనా? ఒక వేళ మజ్లిస్‌ దూరమైతే పరిస్థితేంటి? హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసమో మరే కారణమో తెలియదు కానీ, శాసనసభ చివరి రెండు రోజుల సమావేశాల్లోనూ, ఆ తర్వాత కూడా మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆయన సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి కేసీఆర్‌ను దూరం చేసుకోవడం లేదనే స్పష్టత నిచ్చారు. వారి ప్రకటన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్‌ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో కూడా మజ్లిస్‌తో స్నేహపూర్వక పోటీతో వెళ్లాలని సీఎం కేసీఆర్‌కు మజ్లిస్‌ నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం మద్దతు ప్రకటించారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మజ్లిస్‌తో స్నేహం ఉన్నా లేకున్నా మైనారిటీ వర్గాల్లో పట్టునిలుపుకునేందుకు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో పెద్దయెత్తున నిధులు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో ఈ వర్గానికి రూ.2,200 కోట్లు కేటాయించి మన్ననలు పొందారు. ఈ వర్గాల సంక్షేమంలో ఛాంపియన్‌ లను మేమే అనే విధంగా గత బడ్జెట్‌ కంటె దాదాపు రూ.472 కోట్లు అధికంగా కేటాయించారు. 2021-22 బడ్జెట్‌లో రూ.1728 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మొత్తం కేటాయిం చిన నిధులన్నింటిని ఖర్చు చేయడం విశేషం. గత ఎనిమిదేళ్ల లో మైనారిటీల కోసం రూ.8,581 కోట్లు ఖర్చు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ వర్గాలకు అండగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement