Thursday, March 28, 2024

సారు… కారు….ప‌ద‌హారు …. లోక్ స‌భ సీట్ల‌పై కెసిఆర్ క‌న్ను..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడి, కొత్త రాష్ట్రం ఏర్పాటు-లో ఉద్యమ రథసారధి, సీఎం కేసీఆర్‌ వెంట నడిచి, మంత్రివర్గంలో చోటు- దక్కించుకున్న సీనియర్‌ నేతలు లోక్‌సభ బరిలో దిగనున్నారా? పలువురు సీనియర్‌ మంత్రులను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని పార్లమెంటు-కు పోటీ- చేసేందుకు సిద్ధంగా ఉండాలని భారాస చీఫ్‌ కేసీఆర్‌ సంకేతాలిచ్చారా? అంటే అవుననే అంటు-న్నాయి గులాబీ వర్గాలు. తన మంత్రివర్గంలో పని చేస్తున్న పలువురిని ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా వచ్చే ఏడాది జరిగే పార్ల మెంట్‌ ఎన్నికల్లో రంగంలోకి దించేందుకు భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహం సిద్ధం చేసినట్టు- ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి జాతీయ స్థాయిలో అధికారాన్ని -కై-వసం చేసుకునేందు కు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న కేసీఆర్‌ భాజపా, కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో ఉన్నా రు. కేంద్రంలో అధికారం తమదేనని హైదరాబాద్‌లో ఈ నెల 14న జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో హైదరాబాద్‌ లోక్‌సభ మినహా మిగతా 16 స్థానాల్లో పాగా వేసి భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు దిమ్మ తిరిగేలా చేయాలని కేసీఆర్‌ పక్కా వ్యూహం రచించే పనిలో నిమగ్నమైనట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక వైపు అసెంబ్లీ మరో వైపు లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార ప్రణాళికపై గులాబీ దళపతి వరుస సమావేశాలను నిర్వహిస్తూ వ్యూహం సిద్ధం చేస్తున్నారు. హస్తినలో క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సీనియర్‌ మంత్రులను ఎంపిక చేసి పోటీ-కి పెట్టాలన్న ప్రతిపాదన దాదాపు కొలిక్కి వచ్చినట్టు- చెబుతున్నారు.

మంత్రులను పోటీ-కి పెట్టే పార్లమెంట్‌ స్థానాల్లో కొన్ని ఇవే?
మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు, నలుగురిని లోక్‌సభకు పంపించాలన్న ప్రతిపాదనపై చర్చిస్తున్న కేసీఆర్‌ ఆయా నియోజక వర్గాల్లో పోటీ- చేయించే అవకాశాలున్నట్టు- తెలుస్తోంది. మల్కాజిగిరి, నల్గొండ, మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, సికింద్రాబాద్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాల్లో మంత్రులను లేదా మండలి చైర్మన్‌, ప్రభుత్వ విప్‌ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారిని లోక్‌సభ బరిలో నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు- తెలుస్తోంది. మంత్రుల సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటానని తనను కలుస్తున్న జిల్లా నేతలకు ఇప్పటికే పలు దఫాలు వివరించినట్టు- సమాచారం. ఈ విషయం బట్టి చూస్తుంటే ముగ్గురు నలుగురు మంత్రులను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ- చేయించడం ఖాయమన్న సంకేతాలు భారాసలో వెలువడుతున్నాయి.

అమాత్యులను ఎంపీలుగా పోటీ- చేయించి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిట్టింగ్‌ ఎంపీలలో పలువురికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్‌ స్థానాలుండగా ఇందులో 9 స్థానాల్లో భారాస, నలుగురు భాజపా, మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ- చేసి విజయం సాధించారు. పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల, మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గాల్లో భారాస ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌లలో భాజపా, మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్గొండ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ఎంఐఎం వశమైంది.

- Advertisement -

గ్రూప్‌ రాజకీయాలు కుమ్ములాటలకు చెక్‌ పెట్టే వ్యూహం?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ భారాసలో టికెట్లు- ఆశిస్తున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో క్రమశిక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో అసమ్మతి గళం విప్పుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యేకి ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, మంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మీయ సమావేశాల్లో బాహాబాహీకి దిగి రచ్చరచ్చ చేస్తున్న పార్టీ నాయకులను హైదరాబాద్‌ పిలిపించి పార్టీ అధినాయకత్వం తలంటు- పోసినా, వారి వైఖరిలో మార్చు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అసమ్మతి, అసంతృప్త నేతలను వదిలించుకోవాలంటే వారిని ఎన్నికల బరిలో దించడమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి పార్టీ అధినాయకత్వం వచ్చినట్టు- తెలుస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టల సిద్ధాంతానికి కట్టు-బడి నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నట్టు- సమాచారం.

దుబ్బాక బరిలో మెదక్‌ ఎంపీ కొత్త?
దుబ్బాక అసెంబ్లీ నుంచి మెదక్‌ సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి పోటీ- చేయడం ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దుబ్బాక అసెంబ్లీకి పోటీ- చేసే అవకాశం ఇవ్వాలని ప్రభాకర్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ను అభ్యర్ధించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఉండడంతో ప్రభాకర్‌రెడ్డికి పోటీ- చేసే అవకాశం లేకుండా పోయింది. రామలింగా రెడ్డి హఠాన్మరణంతో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ ప్రభాకర్‌ రెడ్డి పోటీ-కి సిద్ధమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ- చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇవ్వడంతో అయన నియోజక వర్గంలోనే మకాం వేసి ప్రతి గడప తిరుగుతున్నారు.

మహబూబాబాద్‌లోనూ..
ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గంలో భారాస నేతల నడుమ నెలకొన్న వర్గ పోరు అధినాయకత్వానికి చికాకు పుట్టిస్తోంది. మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత ఈ దఫా అసెంబ్లీకి పోటీ-చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మహబూబాబాద్‌ అసెంబ్లీ టికెట్‌ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు- సమాచారం. కవిత తండ్రి సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ డోర్నకల్‌ స్థానం కోరుతుండగా మంత్రి సత్యవతి రాథోడ్‌ డోర్నకల్‌ టికెట్‌ తనకేనని నియోజక వర్గంలో తిరిగి ప్రచారం చేసుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్‌ చెప్పారని ఆమె ప్రకటించుకుంటు-న్నట్టు- సమాచారం. నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిస్థితి ఇలాగే ఉంది. స్థానిక ఎంపీ పోతుగంటి రాములు అసెంబ్లీ బరిలో ఉంటానని ప్రకటించారు. మొత్తం మీద వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు లేదా నలుగురు మంత్రులు లోక్‌సభ బరిలో ఉండడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement