Thursday, March 28, 2024

కేసీఆర్ జార్ఖండ్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం.. ‘దేశ్​కీ నేత’ అంటూ ఘ‌న స్వాగతం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జార్ఖండ్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయ‌న తండ్రి శిబూ సోరెన్‌తో కేసీఆర్ భేటీ అయ్యి.. జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించిన శిబూ సోరెన్‌కు కేసీఆర్ ప్ర‌త్యేక ధ‌న్యావాదాలు తెలిపారు. శాలువాతో శిబూ సోరెన్‌తో పాటు హేమంత్ సోరెన్‌ను స‌త్క‌రించారు. అనంత‌రం హేమంత్ సోరెన్‌తో కేసీఆర్ ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం ఇద్ద‌రు సీఎంలు క‌లిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన దిశ‌లో న‌డ‌వ‌డం లేదు.. దాన్ని స‌రి చేయాల్సిన బాధ్య‌త ప్ర‌తి పౌరుడిపై ఉందన్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌లువురి నేత‌ల్ని క‌ల‌వ‌డం జ‌రుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని న‌డిపేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ నుంచి జార్ఖండ్ రాజ‌ధాని రాంచీకి చేరుకున్నారు. అక్క‌డ కేసీఆర్‌కు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. రాంచీలో ప‌లు చోట్ల కేసీఆర్ బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించి.. ఇలాంటి నాయ‌కుడు దేశానికి అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గిరిజ‌న ఉద్య‌మ నాయ‌కుడు బిర్సా ముండా విగ్ర‌హం వ‌ద్ద‌కు చేరుకుని, పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అక్క‌డ్నుంచి సీఎం హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి కేసీఆర్ వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా గ‌ల్వాన్ అమ‌ర జవాన్ల కుటుంబాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆర్థిక సాయం అందించారు. సీఎం హేమంత్ సోరెన్‌తో క‌లిసి ఆ కుటుంబాల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్‌ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్‌ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చారు.

జార్ఖండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ క‌విత‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement