Saturday, April 20, 2024

హుజురాబాద్ లో గెలుపు ఈటలకు కష్టమేనా?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయం వేడెక్కుతోంది. ఉపఎన్నిక కోసం అటు ఈటల, ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తులుపై ఎత్తలు వేస్తున్నారు. పాదయాత్రతో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే పనిలో ఈటల ఉండగా… దళిత బంధు అంటూ కొత్త పథకంలో సీఎం కేసీఆర్ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. గెలుపు తమదే అంటూ బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అయితే, ఈటలను చిత్తు చేసేందుకు సీఎం కేసీఆర్ ఏకంగా అభివృద్ధి పేరుతో హుజురాబాద్ కు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. బీసీల్లో ఈటలకు పట్టుఉండడంతో కేసీఆర్ ఎస్సీల వైపు నుంచి నర్కుకుంటూ వస్తున్నారు.   

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా ఈటల రాజేందర్‌ను ఓడించడం ద్వారా రాజకీయాల నుంచి శాశ్వతంగా ఇంటికి పంపించాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆరు ఎన్నికల్లో హుజురాబాద్‌ నియోజకవర్గంలో విజయం సాధించిన ఈటలను ఢీకొట్టడమే కాకుండా రాజకీయాలకు ఆయనను దూరం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఈటల ఢీకొట్ట గలిగిన నాయకుడు ఎవరూ లేకుండా పోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బలమైన బీసీ నాయకుడిగా ఉన్న ఈటలపై మరో బీసీ నాయకుడిని రంగంలోకి దింపాలా, లేక నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం కలిగి ఉన్న రెడ్డి అభ్యర్థిని నిలబెట్టాలా, అత్యధిక ఓట్లు ఉన్న దళిత అభ్యర్థిని తెరపైకి తేవాలా అన్న విషయంలో పార్టీ తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాకున్నా కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ద్వారానే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. అంతేకాదు ఈటలకు ప్రధాన అనుచరులుగా ఉన్న కొందరిని టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. నెమ్మదిగా ఈటల నుంచి వారిని దూరం చేస్తోంది.

ఈ క్రమంలో ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు. టీఆర్ఎస్‌ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం ఈటల వర్గానికి షాక్ కి గురి చేసింది. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ క్రమంలో ఈటలకు గెలుపుపై ఆశలు సన్నగిల్లేలా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. కేసీఆర్ వేస్తున్న స్కెచ్లును బీజేపీ అంచనా వేయలేకపోతోంది.

ఈటల రాజీనామాతో ఆయనపై వచ్చిన సానుభూతి ఇప్పుడు క్రమంతో తగ్గుతోందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధానంగా ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే దళిత బంధు అంటూ కొత్త నినాదం ఎత్తుకోవడంతో ఇరత పార్టీ నాయకులను ఆకర్షిస్తున్నారు. బీజేపీకి చెందిన మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డిలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. కేసీఆర్ ప్లాన్ తో బీజేపీకి పెద్ద దెబ్బే పడింది. బీసీ ఓట్లు తక్కువ పడినా.. ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లతో ఉప ఎన్నికల్లో గట్టెక్కొచ్చు అనేది గులాబీ దళపతి కేసీఆర్ వ్యూహాంగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: వివేకా కేసులో కదులుతున్న డొంక.. విచార‌ణ‌కు హాజ‌రైన అనుమానితులు

Advertisement

తాజా వార్తలు

Advertisement