Tuesday, April 16, 2024

కార్తికేయ‌2-నిఖిల్ కి మ‌రో హిట్ట్ అందించిందా..

కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కిన కార్తికేయ‌2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. నిఖిల్ హీరోగా న‌టించాడు. మ‌రి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

క‌థ ఏంటంటే- ఎంబీబీఎస్ పూర్తి చేసి ఓ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటాడు కార్తికేయ (నిఖిల్ సిద్దార్థ) . ప్రతి విషయాన్నీ శాస్త్రీయ దృక్పథంతో చూసే అతను.. మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు. ఐతే తన తల్లి కోరిక మేరకు ఒక మొక్కు తీర్చుకోవడానికి ఆమెతో కలిసి ద్వారకకు వెళ్తాడు. అక్కడ అతడికి కొన్ని అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఒక ఆర్కియాలజిస్ట్ తనకో బాధ్యతను అప్పగించి ప్రాణాలు కోల్పోతాడు. అతణ్ని హత్య చేసిన నేరం కార్తికేయ మీద మోపి పోలీసులు అతడి వెంట పడతారు. వారి నుంచి తప్పించుకుని ఒక లక్ష్యం కోసం కార్తికేయ తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ లక్ష్యం ఏంటి.. దాన్ని అతను చేరుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ-ఎనిమిదేళ్ల కిందట ‘కార్తికేయ’తో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చందూ మొండేటి .. సీక్వెల్ కోసం మళ్లీ ఇంకో ఆసక్తికర కథను తీర్చిదిద్దుకున్నాడు. ఈసారి అతడి కాన్వాస్ పెద్దదైంది. కథలోకి భారీతనం వచ్చింది. ఈ క్రమంలో ఇంకేదో చేయాలన్న తపనలో చందూ అక్కడక్కడా కొంచెం గాడి తప్పినా. . ప్రేక్షకులను నిరాశకైతే గురి చేయలేదు. హీరో ఏమో కళ్లతో చూసేది తప్ప ఏదీ నమ్మని ఒక యంగ్ డాక్టర్.. కథేమో దేవుడు-గుడి చుట్టూ తిరుగుతుంది. ‘కార్తికేయ’ యునీక్ గా అనిపించి ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించడానికి ఈ కాన్సెప్టే ప్రధాన కారణం. ఈ కాన్సెప్ట్ చుట్టూ ఉత్కంఠభరితంగా కథను మంచి థ్రిల్స్ ఇచ్చాడు చందూ మొండేటి. ‘కార్తికేయ-2’లోనూ ఈ కాన్ఫ్లిక్ట్ అయితే సేమ్. హీరో పాత్రను అలాగే ఉంచి.. ‘కార్తికేయ’ థీమ్ ను కొనసాగిస్తూ ఒక కొత్త కథను చెప్పే ప్రయత్నం చేశాడు.

- Advertisement -

నటీనటులు- కార్తికేయ‌2లో ఆద్యంతం మంచి ఎనర్జీతో ఆకట్టుకున్నాడు నిఖిల్. అతడి కష్టం తెరమీద కనిపిస్తుంది. స్వాతి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా బాగానే చేసింది. ఐతే ఆమె హీరోయిన్ లాగా కాకుండా సినిమాలో ఒక పాత్రధారిలానే కనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలో రాణించాడు. సీరియస్ గా సాగే సినిమాలో వైవా హర్షతో కలిసి అతను ప్రేక్షకులకు అక్కడక్కడా నవ్వించాడు. విలన్ పాత్ర చేసిన ఆదిత్య మేనన్ జస్ట్ ఓకే అనిపించాడు. ఆయన పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. హీరో తల్లి పాత్రలో తులసి తనకు అలవాటైన రీతిలో నటించింది. ప్రవీణ్.. సత్యలకు పెద్దగా స్క్రీన్ టైం దొరకలేదు. అభీరుడి పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు.

టెక్నీషియ‌న్స్ – కాలభైరవ సంగీతం అనుకున్నంత స్థాయిలో లేదు. సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నవే ఒకట్రెండు పాటలు. అవి కూడా బ్యాగ్రౌండ్ సాంగ్స్ లాగా నడిచిపోతాయి. అవి సోసోగా అనిపిస్తాయి. థ్రిల్లింగ్ సీన్లలో ఆర్ఆర్ పరంగా ఉండాల్సిన ఎగ్జైట్మెంట్.. హడావుడి కనిపించలేదు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. భారీ లొకేషన్లలో చిత్రీకరించిన సినిమాలో విజువల్స్ టాప్ నాచ్ అనిపిస్తాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. మణిబాబు కరణం మాటలు బాగున్నాయి. చందూ మొండేటి రచయితగా.. దర్శకుడిగా మళ్లీ ఈ చిత్రంతో ఫామ్ అందుకున్నాడు. పురాణాలతో ముడిపెట్టి ఈ కథను అల్లుకున్న తీరు మెప్పిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement