Saturday, April 20, 2024

Success Story: 10 లక్షల కుటుంబాలకు కల్యాణ లక్ష్మి.. ఆడబిడ్డలకు మేనమామగా కేసీఆర్​

ఆడబిడ్డ పెండ్లి అంటే.. పేదింట్లో కలవరం. నలుగురిని పిలవాలన్నా ఖర్చులు చూసుకోవాల్సిన పరిస్థితి. కాస్త ఆడంబరంగా చేద్దామంటే.. అప్పులు చేయక తప్పని దుస్థితి. పెండ్లి చేసిన సంతోషం కండ్లముందు ఉండగానే.. ఆ పెండ్లికి చేసిన అప్పులు భయపెట్టే దీనావస్థ. కూతురుని గడప దాటించింది మొదలు.. ఎప్పుడు అప్పులోళ్లు వచ్చి బాకీ తీర్చమంటారోనని వెంటాడే ఆందోళన.. ఇది గతం!

ఆడబిడ్డ పెండ్లి అంటే.. పేదింట్లో సందడే సందడి.. ఉన్నంతలో అందరినీ పిలుచుకొని, సంతోషంగా విందు మర్యాదలు చేసి, ఎంతో ఆనందంగా బిడ్డను అత్తారింటికి పంపుతున్నప్పుడు.. బాధ, సంతోషం కలగలిసి తల్లిదండ్రుల కండ్లలో జాలువారే అనందబాష్పాలే.. మళ్ల నాలుగు రోజులకు అల్లుడిని వెంటపెట్టుకుని బిడ్డ ఇంటికి వస్తుందన్న ఎదురుచూపుల సంతోషాలే.. ఇది వర్తమానం!!

గతానికి, వర్తమానానికి మధ్య ఒక్కటే తేడా.. అప్పట్లో ఆదుకొనే దిక్కు లేకపోయింది. నేడు అండగా నిలిచిన దీవెనతో.. ఆందోళనకు చోటు లేకుండాపోయింది. ఆ దీవెన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది.. ఆ అండ కల్యాణలక్ష్మి పథకానిది. బిడ్డ పెండ్లికి దాచుకున్న డబ్బు అగ్ని ప్రమాదంలో కాలిపోయి ఓ తండ్రి కారుస్తున్న కన్నీరుతో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌ మదిలో మెదిలిన ఆలోచనకు అద్భుత కార్యాచరణ రూపమే.. కల్యాణ లక్ష్మి పథకం..

ఏ తండ్రీ తన బిడ్డ పెండ్లికి అగచాట్లు పడకూదన్న సంకల్పం నుంచి పురుడు పోసుకున్నదే కల్యాణలక్ష్మి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక.. కేసీఆర్‌ను పది లక్షలమంది ఆడబిడ్డలకు మేనమామను చేసిన ఆపేక్ష.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం.. ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి పథకం. పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెలమీద కుంపటి కావద్దని భావించిన కేసీఆర్‌.. కల్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. 2014 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పథకం.. సీఎం కేసీఆర్‌ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది.

- Advertisement -

తొలుత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహానికి రూ.51,000 వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా, అటు తర్వాత దానిని బీసీలకు సైతం వర్తింపజేశారు. మూడేండ్ల తర్వాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.51,000 నుంచి 75,116కు పెంచారు. ఆ తర్వాత మార్చి 19, 2018 నుంచి ఆ మొత్తాన్ని రూ.1,00116 లకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 10,56,239 మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి లబ్ధి పొందిన వారుండటం విశేషం. అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది అటు తర్వాత కేసీఆర్‌ కిట్లను అందుకుంటుండటం మరో విశేషం. రాష్ట్రంలో ప్రతి పేదింటి కుటుంబం తన బిడ్డ పెండ్లికి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది.

అత్యధికం బీసీలే..

కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందిన వారిలో చాలామంది బీసీలే. పథకాన్ని ప్రారంభించిన మూడేండ్ల తర్వాత ఈబీసీలకు సైతం వర్తింపజేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు పథకానికి 6,38,358 మంది దరఖాస్తు చేసుకోగా, 4,85,135 మందికి మంజూరు చేశారు. ఇప్పటివరకున్న 10,56,239 లబ్ధిదారుల్లో బీసీలే 37.10శాతం కావడం విశేషం. ఇక మొదటి మూడేండ్లను మినహాయించినప్పుడు మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 8,62,349 కాగా, అందులో లబ్ధి పొందిన బీసీలు 4,85,135 మంది. మొత్తంగా పథకం ద్వారా బీసీలే 56.25శాతానికి పైగా లబ్ధిపొందారు. ఈ పథకానికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.9,803.97 కోట్ల బడ్జెట్‌ కేటాయించగా, అందులో రూ.8420.89 కోట్లు (85.89శాతం) ఇప్పటికే ఖర్చుచేసిందంటే కల్యాణలక్ష్మి పథకం ఎంత ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

కల్యాణలక్ష్మి పుట్టింది ఇలా..

ప్రస్తుతం ములుగు జిల్లాలోని కొడిశలకుంట దగ్గర్లోని ఓ తండాలో పేద తండ్రికి వచ్చిన కష్టం.. ఎండాకాలంలో గుడిసెలకు అగ్గి అంటుకుని పెండ్లికి దాచుకున్న డబ్బు, నగలు మొత్తం కాలి బూడిదయ్యాయి. అప్పుడు ఉద్యమ నేత కేసీఆర్​ ఆ కుటుంబాన్ని ఓదార్చి.. ఆ ఆడబిడ్డ పెండ్లి ఖర్చులన్నీ భరించి ఎంతో గొప్పగా పెండ్లి చేశారు. నాటి సంకల్పమే.. నేటి కల్యాణలక్ష్మిగా యావత్​ తెలంగాణ ఆడబిడ్డలకు అండగా నిలుస్తోంది. కేసీఆర్‌ పేర్లు బిడ్డలకు పెట్టుకున్న కల్పనగా మారింది.

ఉద్యమనేతగా ఉన్న సమయంలో ఊరూరూ తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకున్న కేసీఆర్‌.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కష్టాలను తీర్చేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలు చేపట్టారు. మిషన్‌ భగీరథ అయినా.. తండాలను పంచాయతీలు చేయడమైనా.. కల్యాణలక్ష్మి అయినా.. నాటి ఆర్తికి నేడు ఇచ్చిన కార్యాచరణ ఫలితాలే అవి! కల్యాణలక్ష్మి పథకం వెనుక కూడా ఒక ఆసక్తికర ఉదంతం ఉన్నది. అనేక సమావేశాల్లో కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకానికి తనకు స్ఫూర్తినిచ్చిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొంటూ ఉంటారు. 2002 మార్చి నెలలో ములుగు జిల్లా ములుగు మండలం ఓ తండాలో 14 ఇండ్లు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఉద్యమ నాయకుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా వచ్చారు. ఇండ్లను సందర్శించే క్రమంలో బానోతు కీమానాయక్‌ అనే వ్యక్తి గుండెలవిసేలా రోదిస్తూ కనిపించారు. ఆయనను కేసీఆర్‌ అనునయిస్తూ విషయం ఆరా తీశారు. తన కుమార్తె కల్పన వివాహానికి దాచుకున్న రూ.50 వేలు, బంగారం కాలిపోయాయని, పెండ్లి శ్రీరామనవమి తర్వాత పెట్టుకొన్నామని, ఇక తన కుమార్తెకు పెండ్లి కాదేమోనని ఆయన విలపిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు.

 దీనికి చలించిపోయిన కేసీఆర్‌ కీమానాయక్‌ కుమార్తె వివాహ బాధ్యతను తన భుజాన వేసుకొన్నారు. పెండ్లి ఖర్చులన్నీ తానే భరిస్తానని, దగ్గరుండి పెండ్లి జరిపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కీమానాయక్‌ కుమార్తె పెండ్లికి అవసరమైన డబ్బు అందించారు. పెండ్లికి స్వయంగా హాజరై వధూవరులైన కల్పన -యాకూబ్‌లను ఆశీర్వదించి, ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచారు. వివాహం అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో కీమానాయక్‌కు వచ్చిన కష్టం భవిష్యత్తులో ఏ ఆడబిడ్డ తండ్రికి రావద్దనే దృఢ నిశ్చయానికి వచ్చారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇటువంటి పేద తండ్రులకోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. ఉద్యమం ఫలించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. తన మనసులో ఎప్పుడో ఏర్పర్చుకొన్న సంకల్పానికి ఆచరణరూపం ఇచ్చారు. అలా మొదలైనదే కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌.

గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు..

కల్యాణలక్ష్మి ఒక విప్లవాత్మకమైన.. సామాజిక మార్పులకు కారణమైన పథకంగా సామాజికవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలో ఒకప్పుడు బాల్య వివాహాలు ఎక్కుగా జరిగేవి. కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన తర్వాత బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. కల్యాణ లక్ష్మి పథకం వల్లనే బాల్య వివాహాలు తగ్గాయని అనేక సర్వేల్లో తేలింది.

వివక్షలేని కల్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ : బుర్రా వెంకటేశంగౌడ్‌, సెక్రటరీ, బీసీ సంక్షేమశాఖ

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖనే నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తున్నది. పథకాన్ని పకడ్బందీగా, నిరంతరాయంగా అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి మంజూరుచేస్తున్నాం. విడతలవారీగా నిధులను సైతం జాప్యం లేకుండానే విడుదలచేస్తున్నాం. ఎక్కడా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంలేదు. నిరుపేద తల్లిదండ్రులు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పథకంపై ఇటీవల కర్ణాటక బీసీ కమిషన్‌ సభ్యులు సైతం ప్రశంసలు కురిపించారు.

బిడ్డలకు సార్‌ పేరు పెట్టుకున్నం: కల్పన

నా పెండ్లి విషయంలో కేసీఆర్‌ చేసిన మేలు నా చివరి శ్వాస వరకు మర్చిపోలేను. ఆ సారు రోజూ గుర్తుండాలని నా కొడుకు పేరు చంద్రశేఖర్‌రావు, నా బిడ్డ పేరు చంద్రకళ అని పెట్టుకున్నా. రోజూ వారిని చూసినా, పిలిచినా సారే యాదికి వస్తడు. ప్రస్తుతం నేను వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో నా భర్త యాకూబ్‌తో కలిసి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నా. ఒక్కసారి కుటుంబ సభ్యులతో కలిసి సారును కలిసి మాట్లాడితే బాగుండనిపిస్తున్నది. నా పెండ్లి విషయంలో మా నాయనకు వచ్చిన కష్టాన్ని చూసి.. రాష్ట్రంలో పేద కుటుంబాల తండ్రులందరి కష్టాలు తీర్చాలని అనుకొని, కల్యాణలక్ష్మి పథకం పెట్టడం సారు గొప్పతనం. ఆయన నాకు దేవుడితో సమానం.

కేసీఆరే మేనమామ: గుగులోత్‌ బిచ్యారి, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా.

మాది అక్కన్నపేట మండలం దుబ్బతండ. మా ఆయన పేరు భీముడు. మాకు నలుగురు ఆడపిల్లలే. శ్రీలత, సుమలత, స్వర్ణలత, మంగ. ఉన్న రెండెకరాల పొలం చేసుకుంట, కూలీ పనులకు పోవుకుంటనే వాళ్లను సదివించినం. కానీ పెండ్లిళ్లు ఎట్లజేత్తమో ఏమో అని ఎప్పుడూ గుబులైతుండె. పెద్దబిడ్డ శ్రీలత పెండ్లి జేసినప్పుడు మస్తు తిప్పలువడ్డం. ఆ తర్వాత ముగ్గురు బిడ్డల పెండ్లిళ్లలకు సర్కారు పైసలు వచ్చినయ్‌. మొన్ననే చిన్నబిడ్డకు రూ.లక్ష నూట పదహార్లు వచ్చినయ్‌. సీఎం కేసీఆర్‌ సారే నా బిడ్డలకు మేనమామైండు. ఖర్చుల కోసం ఒకరికి చేయిచాపకుంట అందరి బిడ్డల పెండ్లి జేసినం. అంతా సారు దయే.

ఇద్దరు బిడ్డలకు వచ్చింది : కడారి కోమల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా.

మాది టేకుమట్ల మండలం రాఘవాపూర్‌. మా ఆయన పేరు ఐలయ్య. మాకు ఇద్దరు ఆడపిల్లలు శ్రీలత, అంజలి. సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పెట్టక ముందుకు బిడ్డలకు ఎట్ల లగ్గం జేత్తమోనని గుబులుండె. సారు కల్యాణలక్ష్మి పెట్టినంక ధైర్యమచ్చింది. మా ఇద్దరి బిడ్డలకూ పైసలచ్చినయ్‌. సీఎం కేసీఆర్‌ సారే నా బిడ్డలకు మేనమామైండు. ఖర్చుల కోసం ఒకరిని అడుక్కోకుండ అందరి బిడ్డల పెండ్లి జేసినం. ఇదంతా కేసీఆర్‌ సారు దయే.

సార్‌ వల్లే ఆడపిల్లలు గడపదాటిండ్రు: లక్ష్మి, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా

మా ఆయన పేరు సమ్మయ్య. బతుకుదెరువు కోసం సౌది వోయిండు. గుంట భూమి సుత లేదు. ముగ్గురు ఆడపిల్లలు. పెండ్లిళ్లు ఎట్ల జేసుడో ఏమో అని ఎప్పుడూ రందివడుతుంటిని. ఎన్నో తిప్పలు పడి పెద్దిబిడ్డ రాధిక లగ్గం జేసినం. కానీ కేసీఆర్‌ సారు పుణ్యమాని ఇద్దరు బిడ్డలు కోమలత, స్వప్నల పెండ్లిళ్లకు ఆ తిప్పలు లేకుంటపోయినయ్‌. ఇద్దరికీ కల్యాణలక్ష్మి కింద పైసలచ్చియ్‌. ఎవలి దగ్గర చేయిచాపకుంట ఆడబిడ్డలను గడపదాటిచ్చినం. సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.

Advertisement

తాజా వార్తలు

Advertisement