Sunday, November 28, 2021

కాకతీయులనాటి త్రికూఠాలయం.. మరుగున పడుతున్న మరో చరిత్ర..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్య‌స్ : ఒకప్పుడు త్రికూఠాలయంగా విరా జిల్లిన ముప్పారం ముప్పిరినాధ దేవాలయం.. ప్రస్తుతం గబ్బిలాలకు అడ్డాగా మారింది. హన్మకొండ జిల్లా ముప్పారం గ్రామంలోని కాకతీయుల కాలంనాటి విశిష్టమైన ముప్పిరినాధ దేవాలయం గతమెంత గొప్పదైనా ప్రస్తుతం పరిహాసమయిందన్న చందంగా మారింది. వెయ్యేల్లనాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆలయాలతో నిత్యపూజలందుకుంది. కానీ, నిధుల కోసం మనిషి త్రవ్వకాలతో విగ్రహాలు, ఆలయ ప్రాంగణాలు ధ్వంసం కాబడి శిథిలావస్థ స్థితిలో ఉంది. ఇప్పటికైనా పరిరక్షించి చారిత్రాత్మక కట్టడంగా గుర్తించాలని స్థానికులు, పురావస్తు, సామాజిక వేత్తలు విన్నవించుకుంటున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళసై కూడా ఎంతో విశిష్ఠత కలిగిన ఈ ఆలయాన్ని కాపాడుకోవాలని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)కి విన్నవించినా కూడా.. పనులు మాత్రం సాగడంలేదు.

ముప్పిరినాథ ఆలయాన్ని క్రీ.శ 1116-1157లో కాకతీయ పాలకుడు రెండవ ప్రోల రాజు భార్య ముప్పమాంబ నిర్మించింది. ఈ ఆలయం కాకతీయుల కాలంనాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే గొప్ప ప్రతిమలతో నిండి ఉంది. ఆలయ నిర్మాణంపై చెక్కిన శిల్పాలలో పంచతంత్ర కథలు, రామాయణం వంటి ఇతిహాసాల దృశ్యాలు ఉన్నాయి. కాకతీయుల కట్టడాలకు ఉండే గుడి, చెరువు, ఊరు శైలి ఈ కట్టడానికి కూడా ఉంది. ఈ త్రికూఠాలయానికి పక్కనే కాకతీయులు ముప్పారం చెరువును నిర్మించారు. ఈ చెరువుకు ధర్మసాగర్‌ చెరువు నుంచి నీరు వస్తుంది. అక్కడికి కాళేశ్వరం నుంచి నీరు వచ్చే విధంగా గొలుసు కట్టు చెరువుల నిర్మాణం జరిగింది. వరంగల్‌ నగరానికి 25 కి.మీ.ల దూరంలో అనంతారం దేవునూరు అటవీశాఖ పరిధిలోని సుందరమైన ఇనుపరాతి గుట్టల్లో ముప్పారం చెరువు కట్టపై ఈ ఆలయం నిర్మితమై ఉంది. ఈ ఆలయం కాకతీయుల అద్భత నిర్మాణ కళను, గత వైభవాన్ని భవిష్యత్తు తరాలకు తెలియ జెప్పటానికి ఆలయాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని స్థానికులు, పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 130 చారిత్రక కట్టడాలు ఏఎస్‌ఐ ఆధీనంలో ఉండేవి. కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంతంలో కేవలం 8 చారిత్రక కట్టడాలు మాత్రమే ఏఎస్‌ ఐ నియంత్రణలోకి రాగా.. మిగిలినవన్నీ ఏపీలో ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో పాత వరంగల్‌ జిల్లాలోని రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, వరంగల్‌ కోటలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఏఎస్‌ఐ మరికొన్ని చారిత్రాత్మక స్మారక చిహ్నాల సంరక్షణ మరియు పునరుద్ధరణకు సిద్ధంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముప్పిరినాథ ఆలయానికి ఇకనైనా నిధులను మంజూరు చేసి, కాకతీయులనాటి కళాకండాన్ని కాపాడుకోవాలని, చారిత్రక కట్టడాల గుర్తింపును కలిగించాలని స్థానికులు విజ్ఞప్తిచేస్తున్నారు. కానీ, వెయ్యేల్లనాటి చరిత్ర కలిగిన త్రికూఠాలయం గబ్బిలాలకు నెలవు అవ్వడం పట్ల ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తున్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News