Friday, March 29, 2024

Success Story: మరో కోనసీమగా కాగ్నా ఏరియా.. మండు వేసవిలో నిండుగా చెక్‌డ్యాంలు

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాలు ఇప్పుడు కోన‌సీమ‌ను త‌ల‌పిస్తున్నాయి. ఒక‌ప్పుడు ఎండిన చెరువులు, నెర్రెలువారిన కాల్వ‌లు, పిచ్చిమొక్క‌ల‌తో దారుణంగా క‌నిపించే ప‌ల్లెల్లో ఇప్పుడు కొత్త‌క‌ళ క‌నిపిస్తోంది. ఇదంతా తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ తీసుకున్న ముందుచూపు నిర్ణ‌యాల‌తోనే సాధ్య‌మైంది. ఎక్క‌డ చూసినా చెరువుల‌న్నీ నిండుగా జ‌లాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి.. కాగా, వికారాబాద్ జిల్లాలోని కాగ్నా న‌ది ఏరియా అయితే.. అచ్చు కోన‌సీమ‌ను మ‌రిపిస్తోంది..

వికారాబాద్‌, (ప్రభన్యూస్‌ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అనేక ఫలితాలనిస్తోంది. నదులపై వంతెనల స్థానంలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఎక్కడ కొత్తగా వంతెన నిర్మిస్తే దాని పక్కనే బ్యారేజీలను నిర్మిస్తున్నారు. ఈ నిర్ణయంతో జీవం కోల్పోయిన కాగ్నా నదిలో ప్రస్తుతం జలకళ ఉట్టిపడుతోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మీదుగా ప్రవహించే కాగ్నాలో ఇప్పుడు జల సందడి దర్శనమిస్తోంది. మండు వేసవిలోనూ నదిలో నీటి పరవళ్లు స‌వ్వ‌డి చేస్తున్నాయి. నీటి లభ్యత పెరగడంతో సాగు విధానం పూర్తిగా మారిపోయింది. బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలు నిర్మించిన ప్రతిచోట మరో కోనసీమ దర్శనమిస్తోంది. పచ్చని పొలాలు.. ఏపుగా పెరిగిన వివిధ వృక్షాలు.. పక్షుల సందడి విశేషంగా ఆకట్టుకుంటోంది.

జిల్లాలోని వికారాబాద్‌..తాండూరు ప్రాంతాల మీదుగా ప్రవహించే కాగ్నా నది నిన్న మొన్నటి వరకు పెద్దగా సాగుకు ఉపయోగపడలేదు. కేవలం తాగునీటి అవసరాలకు ఈ నదిని వినియోగిస్తూ వచ్చారు. నదిలో నీటి లభ్యత పెద్దగా లేకపోవడంతో పంటల సాగు జరగలేదు. నదిపై ఎక్కడా ఆనకట్టలు లేకపోవడం..నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో ప్రతిఏటా వర్షాకాలంలో కురిసిన నీరు అంతా కూడా కిందకు వెళ్లిపోయేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది. నదులపై పెద్ద ఎత్తున చెక్‌డ్యాంలను నిర్మించడంతో పాటు నదులపై కొత్తగా నిర్మించే వంతెనల స్థానంలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో కాగ్నా నది స్వరూపం మారిపోయింది. నిన్నటి వరకు వట్టిపోయి కనిపించిన కాగ్నా నదిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి ప్రవాహం కనిపిస్తోంది.

మూడు చోట్ల బ్రిడ్డి కమ్‌ బ్యారేజీలు
తాండూరు ప్రాంతంలోని తాండూరు మండలం నారాయణపూర్‌ గ్రామం, వీర్‌ శెట్‌పల్లి గ్రామం, బషీరాబాద్‌ మండలం జీవన్గి గ్రామం వద్ద కాగ్నా నదిపై మూడు వంతెనలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడ వంతెనలతో పాటు బ్యారేజీలను కూడా నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. దీంతో మూడు ప్రదేశాలలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో నారాయణపూర్‌, వీర్‌శెట్‌పల్లి గ్రామాల వద్ద బ్రిడ్జి కమ్‌ బ్యారేజీల నిర్మాణం పూర్తి అయ్యింది. ఇక నారాయణపూర్‌ గ్రామ ఎగువ భాగం తాండూరు పట్టణ సమీపంలోని కాగ్నా నదిపై చెక్‌డ్యాంను నిర్మించారు. ప్రస్తుతం ఈ మూడు చోట్ల భారీగా నీటి నిల్వ ఉంది. మండు వేసవిలో కూడా బ్రిడ్జి కమ్‌ బ్యారేజీల వద్ద నీరు పరవళ్లు తొక్కుతోంది. కిలోమీటర్ల మేరకు కాగ్నా నదిలో నీటి నిల్వ దర్శనమిస్తోంది. నదిలో నీటి నిల్వ పెరగడంతో సమీప పొలాలలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. కిలోమీటర్ల పొడవునా నదిలో జలకళ సంతరించుకోవడంతో పంటల సాగు విధానంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.

నాడు బీళ్లు..నేడు పచ్చని పొలాలు
బ్రిడ్జి కమ్‌ బ్యారేజీల నిర్మాణంకు ముందు కాగ్నా నది పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు బీళ్లుగా ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలోని పొలాలలో కేవలం వర్షాకాలంలోనే పంటల సాగు జరిగేది. పక్కనే కాగ్నా నది ఉన్నా అందులో నీటి లభ్యత లేకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో మాత్రమే పంటల సాగు జరిగేది. తాజాగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాగ్నానదిలో ఏడాది పొడవుగా నీటి లభ్యత ఉంటోంది. ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలు..బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలను నిర్మించడంతో పుష్కలంగా నీరు లభిస్తోంది. దీంతో సమీప గ్రామాలలోని పొలాలలో పెద్ద ఎత్తున పంటల సాగు జరుగుతోంది. ప్రస్తుతం ఈ భూములలో రెండు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వరి పంట సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. కొందరు రైతులు పండ్ల తోటలను..ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఉల్లి పంటల సాగు సైతం భారీగా పెరిగింది. బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలను నిర్మించిన ప్రాంతంలోని గ్రామాలలో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చిన్న నిర్ణయంతో నదుల స్వరూపంను మార్చడంతో పాటు పరివాహ ప్రాంతాల్లోని పొలాలలో నీటి లభ్యత పెరిగి వ్యవసాయం పండగలా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement