Thursday, April 25, 2024

NV Ramana: ఆ నియామకం ఒక అపోహ: న్యాయవ్యవస్థపై సీజేఐ కీలక వ్యాఖ్య

న్యాయమూర్తులు జడ్జీలను నియమించడం ఒక అపోహ అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ అన్నారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో న్యాయమూర్తులు స్వయంగా న్యాయమూర్తులను నియమిస్తారు అనే భావన అపోహ అని చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో “భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్తులోని సవాళ్లు” అనే అంశంపై ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ఇటీవలి కాలంలో జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే, ప్రచారంలో ఉన్న భ్రమ అని సీజేఐ రమణ అన్నారు. మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఆటలో ఓ పావే అని చెప్పారు. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని తెలిపారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా, అది తెలిసిన వాళ్లు కూడా ‘జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేస్తున్నారని, భౌతిక దాడులకూ దిగుతున్నారని ఆయన చెప్పారు. ఆ ఘటనలపై కోర్టులు స్పందించేంత వరకూ ఏ అధికారులూ స్పందించడం లేదని, ఘటనలపై దర్యాప్తు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలకు అనుకూలమైన ఉత్తర్వు రాకపోతే న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏకీకృత ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్లంతా ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మల్లాగే ఉంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను విముక్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారికి పూర్తి స్వాతంత్ర్యం కల్పించాలని, న్యాయస్థానాలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలని ఆయన చెప్పారు. ‘న్యాయమూర్తులు స్వయంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారు’ వంటి పదబంధాలను పునరుద్ఘాటించడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement