Saturday, April 20, 2024

కేంద్రంలో ఎవ‌రుండాల‌న్న‌ది డిసైడ్ అయ్యేది నేడే.. యూపీలో తొలివిడ‌త‌ పోలింగ్ షురూ..

దేశంలోని 5 రాష్ట్ర‌ల ఎన్నిక‌ల్లో భాగంగా ఇవ్వాల తొలివిడ‌త పోరు షురూ అయ్యింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాల‌నేది డిసైడ్ చేసే యూపీలోని ప‌శ్చిమ ప్రాంతంలో మొద‌టి విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ ఎక్కువ సీట్లు ఎవ‌రికి వ‌స్తే ఆ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఆ న‌మ్మ‌కాన్ని నిజం చేసుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాత్మ‌కంగా రంగంలోకి దిగాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో పశ్చిమ యూపీ ప్రాంతానికిచెందిన‌ 11జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో అందరి చూపు యూపీపైనే పడింది. ఇంతవరకు నువ్వా నేనా అంటూ పార్టీలన్నీ పోటీపడ్డాయి.ఇప్పుడు ప్రజాతీర్పు ఎలా ఉంటుందోనన్న టెన్షన్ అన్నీ పార్టీల్లోనూ కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీ పీఠానికి యూపీ రహదారి వేస్తుందన్న భావిస్తున్న అన్నిపార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

యూపీలో తొలి విడత ఎన్నికల్లో భాగంగా 11 జిల్లాల్లో మొత్తం 58 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఫస్ట్‌ ఫేజ్‌లో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారుగా 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార బీజేపీతో పాటు ఎస్పీ – ఆర్‌ఎల్డీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఎంఐఎం పోటీలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో జాట్‌ – ముస్లీంల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. యూపీ జనాభాలో జాట్ల శాతం కేవలం 2 శాతమే అయినా.. వీరి పాత్ర చాలా కీలకం. దాదాపు 30నియోజకవర్గాల్లో 30% మంది చొప్పున జాట్లు ఉన్నారు. వీరు ఎవరివైపు మొగ్గు చూపితే వారినే విజయం వరించనుంద‌నే అంచ‌నాలున్నాయి. జాట్లలో ఎక్కువమంది రైతులు ఉన్నారు. గత ఎన్నికల్లో వీరు బీజేపీకి మద్దతిచ్చారు. అయితే ఈసారి రైతు చట్టాలతో పరిస్థితి మారే చాన్స్ ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మరో సెంటిమెంట్‌ కూడా ఉంది. పశ్చిమ యూపీలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే వాళ్లే అధికారాన్ని చేపడతారని నమ్ముతారు. అందుకే ఫస్ట్‌ఫేజ్‌పై పార్టీలన్నీ ఫుల్‌ ఫోకస్ పెట్టాయి. ఈ తొలివిడత ఎన్నికల బరిలో మొత్తం 9 మంది మంత్రులు పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కుమారుడు పంకజ్‌సింగ్‌ నోయిడా నుంచి బరిలో ఉన్నారు. నోయిడా, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌, మథుర, అత్రౌలి, కైరానా, థానా భవన్‌ కీలకంగా స్థానాలుగా భావిస్తున్నారు. గతంలో ఇక్కడ 58 స్థానాలకు గానూ బీజేపీ 53 స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా ఏమాత్రం తగ్గకుండా సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమాగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జాట్ల ఆదరణ ఎక్కువగా ఉన్న ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకుంది. అందుకే తొలివిడతలో బీజేపీ, ఎస్పీ – ఆర్‌ఎల్డీ కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధిని నమ్ముకుని బరిలోకి దిగితే… సరికొత్త కుల సమీకరణాలనే ఎస్పీ నమ్ముకుంది. ఇక తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటలు జ‌ర‌గ‌కుండా పకడ్భందీ ఏర్పాట్లు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

గత ఎన్నికల్లో ఎవరికి.. ఎన్ని సీట్లు?

బీజేపీ 53 సీట్లు గెలుచుకుంది
సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది
బీఎస్పీ 2 సీట్లు గెలుచుకుంది
ఆర్‌ఎల్‌డీకి 1 సీటు దక్కింది

ఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్‌ చౌదరి కలిసి బరిలోకి దిగారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ని RLDకి బలమైన కోటగా పరిగణిస్తారు. జయంత్ చౌదరికి అతని తండ్రి అజిత్ సింగ్ మరణం తర్వాత ఇది మొదటి పరీక్ష. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ నుంచి 58 మంది అభ్యర్థులను బరిలోకి దించాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 28 మంది అభ్యర్థులు, ఆర్‌ఎల్‌డీకి చెందిన 29 మంది, ఎన్‌సీపీకి చెందిన ఒక్కరు బరిలో ఉన్నారు. 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రావాలంటే మొదటి విడత ఎన్నికలే కీలకం అంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement