Friday, April 19, 2024

ఇంట్లోనే ఆక్సిజన్‌ను ఎక్కువగా అందించే మొక్కలు

సాధారణంగా మొక్కలు గాలిలోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుని తిరిగి ఆక్సిజన్‌ విడుదల చేస్తుంటాయి. అలాంటప్పుడు కొత్తగా ఆక్సిజన్‌ మొక్కలంటే ఏమిటనే సందేహం రావచ్చు. కానీ అన్ని మొక్కలు ఒకేస్థాయి, ఒకే విధంగా శ్వాసక్రియను జరపవు. అదేవిధంగా ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌, రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. అదీగాక అవి విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ. కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి. వీటినే పర్యావరణ ప్రేమికులు, బయాలజిస్టులు ఆక్సిజన్‌ మొక్కలుగా పిలుస్తుంటారు. వాటిలో కొన్ని మీ కోసం..

మనీ ప్లాంట్
దీనిని సాధారణంగా పోథోస్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. ఇది అలంకరణ మొక్కగా కూడా ప్రసిద్ధి పొందింది. దీనిని ప్రత్యేకత ఏంటంటే 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.

అరెకా ఫామ్
ఈ మొక్క చక్కటి ఇండోర్‌ ప్లాంట్‌. కార్బన్‌ డైయాక్సైడ్‌నే గాకుండా గాలిలోని కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది. గాలిని శుద్ధి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.

స్నేక్ ప్లాంట్
నాసా గుర్తించిన మరో ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క ఇది. అంతేగాక ఎక్కువ మంది ప్రేమించే మొక్క. ఇంట్లోని గాలిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కార్బన్‌తో పాటు, ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, జైలిన్‌ వాయువులనే కాదు.. ట్రై క్లోరో ఇథలిన్‌, నైట్రోజన్‌ తదితర అధిక కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేస్తుంది.

తులసి మొక్క
భారతీయతకు తులసి మొక్కకు ఉన్న సంబంధం ప్రాచీనమైనది. అదీగాక అనేక ఆయుర్వేద ఔషధగుణాలున్న మొక్క ఇది. అందుకే దీనిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. రోజులో కనీసం 20 గంటల పాటు ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటుంది. అదేవిధంగా కార్బన్‌ డై యాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డై యాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులను సైతం ఇది పీల్చుకుని ప్రాణవాయువును అందిస్తుంది.

- Advertisement -

స్పైడర్ ప్లాంట్
ఇండోర్‌ ప్లాంట్‌గా ఎక్కువగా ప్రసిద్ధి. ఇంట్లోని గాలిని అధిక శాతం శుద్ధి చేస్తుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే తీవ్ర ఒత్తిడిని సైతం పోగొడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement