Tuesday, April 23, 2024

Spl Story: భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం.. ఎవరెవరు ఓటు వేయొచ్చు!

భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పలు అంశాలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీతోపాటు విపక్ష పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. అయితే.. అసలు భారత రాష్ట్రపతి విధులేంటి, బాధ్యతలేంటి.. ఆయన ఏం చేస్తారు అనే అంశాలపై చాలా మందికి అవగాహన లేదు. నేటి తరం స్టూడెంట్స్​, యువత రాష్ట్రపతి ఏం చేస్తారన్నదానిపై తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పటిదాకా ఇండియాలో ఎవరెవరు రాష్ట్రపతులుగా ఉన్నారు. వారి పదవీ కాలం ఎంత అనే అంశాలను పరిశీలిద్దాం..

‌‌- డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రకటించింది. జూలై 21న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఈ ఎన్నికల ద్వారా భారత 16వ రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఇంతవరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. అయితే.. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగిసే ముందు 60వ రోజు కానీ, ఆ తర్వాత కానీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ దవీ కాలం జూలై 24తో ముగియనుంది.

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్​..

  • జూన్ 15న రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌
  • జూన్ 29 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
  • జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు
  • జులై 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌
  • జులై 21న ఓట్ల లెక్కింపు

రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్‌ విధానం ఎట్లుంటది?

- Advertisement -

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేయాలనకునే వారికి నామినేషన్‌ పత్రాలు ఢిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్‌ను తప్పనిసరిగా ఎలక్టోరల్‌ కాలేజీలోని 50 మంది ప్రపోజ్‌ చేయాలి. మరో 50 మంది సపోర్ట్‌ చేయాలి. నామినేషన్‌ను ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో దాఖలు చేయవచ్చు. దీని కోసం 15వేల రూపాయలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఇక.. ఎన్నిక ఎట్లా ఉంటుందంటే..

రాష్ట్రపతి దేశాధినేత, సాయుధ దళాల సుప్రీం కమాండర్. దేశ ప్రధానిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. కానీ, రాష్ట్రపతిని మాత్రం పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ద్వారా ఎన్నికైన  ప్రజాప్రతినిధులు ఓటు వేయడం ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండాలి. 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అతను లేదా ఆమెకు తప్పనిసరిగా లోక్‌సభ సభ్యుడిగా అర్హత ఉండాలి. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 4,809 మంది ఉన్నారు. వారి ఓటు విలువ 10,86,431. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ఇక.. పార్లమెంటు, అసెంబ్లీల్లో ఉన్న నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు.

ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్ మార్క్‌ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్‌ ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు వారి శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మరెక్కడైనా ఓటు వేయాల్సి వస్తే కనీసం 10 రోజులు ముందుగా కమిషన్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్‌ పాటించాలి. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్‌ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్‌ తర్వాత వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్‌ అధికారి సమక్షంలోనే ఓట్లను లెక్కిస్తారు.

ఓటు విలువ లెక్కింపు ఎట్లుంటుంది..

ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యనే డివైడ్‌ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు.

ఇక.. ఎంపీలకు సంబంధించి దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ (5,43,321)ను మొత్తం ఎంపీల సంఖ్య(776)తో డివైడ్‌ చేస్తారు. ఈ మేరకు ఈ సారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు. పోల్‌ అయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం +1 (కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కాగా, భారత రాష్ట్రపతి పదవీ కాలం అయిదు సంవత్సరాలు ఉంటుంది.

రాష్ట్రపతికి శాసన వ్యవస్థకు సంబంధించిన అధికారాలు

  • పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరుస్తారు, ముగిస్తారు, లోక్ సభను రద్దుచేస్తారు
  • ప్రతి సంవత్సరం ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం కూడా, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినదే అయి ఉంటుంది.
  • పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశాకే చట్టంగా మారుతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపవచ్చు. అయితే పార్లమెంటు మళ్లీ ఆ బిల్లును పంపినప్పుడు, రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.
  • పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చెయ్యవలసి వస్తే, రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సును జారీ చెయ్యవచ్చు. అయితే తర్వాత సమావేశాల్లో ఆ  ఆర్డినెన్సును పార్లమెంటు ఆమోదించాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement