Wednesday, April 24, 2024

ఓవల్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ

ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 368 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ ను 210 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. ఐదో రోజు ఆటలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ్ 10 వికెట్లు చేజార్చుకుని ఘోర పరాజయం చవిచూసింది.టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్రజడేజా 2 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో పుంజుకున్న టీమిండియా 466 పరుగులు నమోదు చేసి, ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట చివరికి ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా 77 పరుగులు చేసిన ఆతిథ్య ఇంగ్లండ్, చివరిరోజు ఒత్తిడికి లోనై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.  

ఈ సిరీస్ లో తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టును భారత్ గెలిచింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. తాజా విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఈ నెల 10 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement