Tuesday, September 19, 2023

Big Story | జూన్‌ రెండో వారంలో కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి?.. అదే దారిలో మరో ఇద్దరు మాజీ ఎంపీలు

కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారు సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరితో పాటు ఇతర పార్టీలోని అసంతృప్తులు కూడా హస్తం పార్టీ వైపు అడుగులు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అందులో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైందని చెబుతున్నారు.

‌- హైదరాబాద్‌, ఆంధ్రప్రభ

- Advertisement -
   

జూన్ 4వ తేదీన అమెరికాలోని వాసింగ్టన్‌లో నిర్వహించే ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెెళ్లుతున్నారు. రాహుల్‌తో పాటు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా వెళ్లుతున్నారు. రాహుల్‌గాంధీ జూన్‌ 10న అమెరికా నుంంచి తిరిగి స్వదేశానికి రానున్నారు. అంతకు మందే రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి వస్తారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికల అంశపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్‌ పెద్దల నేతలతోనూ పార్టీలో చేరే తేదిపై చర్చించనున్నారు. వీరి చేరికతో కాంగ్రెస్‌ పార్టీకి మరింత జోష్‌ పెరిగే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం పెరుగుతోందని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా అధికార బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని టాక్‌ వినిపిస్తోంది. అయితే జూపల్లి కృష్ణారావు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు.. పార్టీ విజయం కోసం గట్టిగానే పని చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డితో విభేదాలు రావడంతో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇప్పటీ వరకు ఏ రాజకీయ పార్టీలో చేరకుండా తటస్థంగానే ఉంటున్నారు. కేఎల్‌ఆర్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మొదటి నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీనే బెటర్‌ అని, తిరిగి సొంత గూటికి వచ్చి వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇటీవలనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ మాజీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఆత్మరక్షణలో పడ్డారని ప్రచారం. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో మంచి నాయకుడిగా ఉండటమే కాకుండా.. సొంత నియోజక వర్గమైన నిర్మల్‌ మహేశ్వర్‌రెడ్డికి మంచి పట్టు ఉన్నది. ఆయన కాంగ్రెస్‌ వీడి బీజేపీలో చేరినప్పటికి.. మెజార్టీగా కేడర్‌ మాత్రం కాంగ్రెస్‌లో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారికి టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టత ఇస్తే తిరిగి సొంత గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక కీలక నేత పేర్కొన్నారు.

టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అప్పీల్‌ పలిస్తుందా?
కాగా, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పార్టీని వీడిన నేతలు.. సొంత గూటికి రావాలని ఆప్పీల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, ఈ విషయంలో అవసరమైతే పది మెట్లు దిగేందుకు తాను సిద్ధమని, క్షణికావేశంలో పార్టీని వీడిన ప్రతి నాయకుడు.. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలు పార్టీ మారే సమయంలో రేవంత్‌రెడ్డిపైనే విమర్శలు చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మాత్రం రేవంత్‌రెడ్డికి వ్యక్తిగతంగా సన్నిహితంగానే ఉంటారు. ఇప్పుడు వారు తిరిగి సొంత గూటికి వస్తే పార్టీకి మరింత లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement