Wednesday, March 27, 2024

నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: పాక్ మాజీ ప్రధాని

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదం, హత్యలు, దోపిడీ వంటి అభియోగాలపై దాదాపు 100 కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మరోసారి అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోర్టులోనే తనను చంపేసే అవకాశముందని, అందువల్ల విచారణకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ మేరకు పాక్‌ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అట్టా బాందియల్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ లేఖ రాశారు.

”తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు గత శనివారం నేను ఇస్లామాబాద్‌ లోని ఫెడరల్‌ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ కోర్టుకు వెళ్లాను. అక్కడ నన్ను చంపేందుకు విఫలయత్నం జరిగింది. దాదాపు 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలో నన్ను చంపేందుకు వేచి ఉన్నారు. సాధారణ దుస్తుల్లో ప్లాస్టిక్‌ సంకెళ్లు పట్టుకుని కన్పించారు. వారంతా నన్ను పట్టుకుని చంపేయాలని భావించారు. అయితే అదృష్టవశాత్తూ అది జరగలేదు. అత్యంత భద్రత కలిగిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోకి ఆ గుర్తుతెలియని వ్యక్తులు ఎలా వచ్చారో దర్యాప్తు జరిపించాలి. ఇలాంటి వాటిని నేను బయటపెడుతుంటే.. నన్ను చంపేసేందుకు వారికి ఎక్కువ సమయం పట్టదు. కోర్టుకు వస్తే అక్కడే హత్య చేస్తారేమో. అందువల్ల విచారణలకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నా” అని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేగాక, తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ఆయన చీఫ్‌ జస్టిస్‌ను అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement