Saturday, April 20, 2024

అమిత్​షా ఇంటిపై దాడి చేస్తే కోట్లాది రూపాయలు దొరుకుతాయి, చేస్తారా?.. ఈడీకి ఆప్​ నేత సవాల్​

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అప్రూవర్​గా మారేందుకు తాను రెడీగా ఉన్నానని మనీష్ సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరా చెప్పిన కొద్ది గంటలకే ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ బీజేపీపై, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా ఇంటిపై దాడులు చేస్తే కోట్లాది రూపాయలు దొరుకుతాయని ఆప్ నేత ఆరోపించారు. మరి ఇంత నిక్కచ్చిగా ఉన్నామని చెబుతున్న ఈడీ కానీ, సీబీఐకి కానీ అమిత్ షా ఇంటిపై దాడి చేసే దమ్ము ఉందా? అని సౌరభ్ భరద్వాజ్ సవాల్​ చేశారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు దినేష్ అరోరా సన్నిహితుడని, మద్యం లైసెన్సుదారుల నుంచి వసూలు చేసిన డబ్బును దాచిపెట్టడంలో, దారి మళ్లించడంలో చురుగ్గా పాల్గొంటున్నాడని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గతంలో పేర్కొంది. ఈ కేసులో సిసోడియా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, అరోరా సోమవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పాత్ర గురించి అన్ని నిజాలను వెల్లడించడానికి తాను అప్రూవర్​గా మారుతానని చెప్పారు.

అయితే.. ఇట్లాంటి పలు విషయాలపై బీజేపీ కట్టు కథలు వస్తూనే ఉంటాయని, వారు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తారని గుజరాత్, ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనిఆప్​ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మోసగాళ్లతో కలిసి బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో దర్యాప్తు జరుపుతున్న సీబీఐని కూడా సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. “దేశంలోని అతిపెద్ద ఏజెన్సీకి ఈ నాలుగు నెలల్లో ఎట్లాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. మరి ఎందుకింత డ్రామా” అన్నారు. ఇట్లాంటి తప్పుడు కేసులతో ఉన్నత పదవులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ఇబ్బంది పెడుతుంటే.. హోం మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయం యొక్క విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement