Wednesday, April 17, 2024

Big Story: అక్కడా నేనే, ఇక్కడా నేనే.. ఆ నాలుగు జిల్లాల్లో ఇద్దరు క‌లెక్ట‌ర్ల‌ డ‌బుల్ రోల్‌!

పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర‌మే సేవ‌లు అందుతాయ‌న్నది సీఎం కేసీఆర్ నిర్ణ‌యం.. కానీ, రెండు జిల్లాల‌కు ఒకే క‌లెక్ట‌ర్ ఉండ‌డంతో ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు చెప్పుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు. కీలకమైన రెండు జిల్లాలకూ ఒకే క‌లెక్ట‌ర్ ఉండ‌డమే ఇక్కడ స‌మ‌స్యగా మారింది. దీనిపై ప్ర‌భుత్వ పెద్ద‌లు దృష్టిసారించి ఫుల్‌టైమ్ ఆఫీస‌ర్ ఉండేలా చొర‌వ చూపాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి): మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాకు పూర్తి స్థాయిలో కలెక్టర్‌ లేరు.. మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ హరీష్‌ మేడ్చల్‌ జిల్లా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న అమోయ్‌కుమార్‌కు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు.. వీరిద్దరూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే.. తమ జిల్లాలతోపాటు అదనపు జిల్లాల బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.. కాగా, కీలక జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్లను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్ర‌జ‌ల నుంచి విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి.

ఒక జిల్లా బాధ్య‌త‌ల్లో ఒకరు ఉండ‌డమే కష్టమైన ఈ రోజుల్లో రెండేసీ పనులు చేయడం శక్తికి మించిందే.. కొన్ని రోజులపాటు చేస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ నెలలు, సంవత్సరాలపాటు ద్విపాత్రాభినయం చేయడం ఇబ్బందే మ‌రి. రెండు కీలక జిల్లాలకు చెందిన కలెక్టర్లకు మరో రెండు కీలక జిల్లాల బాధ్యతలు అప్ప‌గించ‌డంతోనే ఈ స‌మ‌స్య వ‌స్తోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌కు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. దాదాపుగా మూడు మాసాలుగా అటు ఇటు బాధ్యతలు చూస్తున్నారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ పదవీవిరమణ చేయడంతో అమోయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ హైదరాబాద్‌లోనే ఉండటంతో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. గతమాసం 25వ తేదీనుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ 50 కిలోమీటర్ల దూరానికి మారింది. అవుటర్‌ రింగ్‌రోడ్డు పక్కన కొంగరకలాన్‌లో సమీకృత నూతన కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆగస్టు 25వ తేదీన నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. అప్పటినుండి అక్కడినుండే పాలన కొనసాగుతోంది. దాదాపుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రోజుకు వంద కిలోమీటర్లకు పైగానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

రెండూ కీలక జిల్లాలు కావడం వీవీఐపీల పర్యటనలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు ఇటు పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఇటు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అమోయ్‌కుమార్‌. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ గోల్కొండలో త్రివర్ణ జెండాను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌కు హాజరుకావల్సి వచ్చింది. అదే రోజు రంగారెడ్డి జిల్లా వేడుకలు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో వేడుకలు జరిగాయి.

ఈ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. సీఎం కార్యక్రమం పూర్తి అయ్యాక…రంగారెడ్డి జిల్లా కార్యక్రమంలో అమోయ్‌కుమార్‌ పాల్గొనాల్సి వచ్చింది. కీలక కార్యక్రమాల్లో ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. మొత్తం మీద రెండు జిల్లాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు అమోయ్‌కుమార్‌.

మేడ్చల్‌ జిల్లాకు ఏడాదికాలంగా ఇన్‌చార్జినే..
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు ఏడాదికాలంగా ఇన్‌ఛార్జీ కలెక్టర్‌ పాలనే కొనసాగుతోంది. గతంలో అక్కడ పని చేసిన కలెక్టర్‌ను బదిలీ చేసిన తరువాత పూర్తి స్థాయిలో కలెక్టర్‌ను నియమించలేదు. గత ఏడాది ఆగస్టు మాసం నుండి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ హరీష్‌కు మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏడాది కాలంగా అటు మెదక్‌ ఇటు మేడ్చల్‌ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కీలక జిల్లా. ఇందులో 70 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుంది. జిల్లాలో 4 కార్పొరేషన్లు 7 మునిసిపాలిటీలు 61 గ్రామ పంచాయతీలున్నాయి.

మేడ్చల్‌ జిల్లా దాదాపుగా హైదరాబాద్‌లో కలిసిపోయింది. దీంతో ఈ ప్రాంతాల్లో వెంచర్లు…నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దాంతోపాటు విలువైన భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లా ఇన్‌ఛార్జీ కలెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ హరీష్‌ మేడ్చల్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. రెండూ కీలక జిల్లాలు కావడంతో రెండింటిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సి వస్తోంది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకవచ్చేందుకు ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. గతంలో సమక్య రాష్ట్రంలో కేవలం పది జిల్లాలు మాత్రమే ఉండేవి. వాటిని ఏకంగా 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ జిల్లాను మినహాయించి అన్ని జిల్లాలను విడగొట్టారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మూడుగా విభజించారు. రంగారెడ్డితోపాటు వికారాబాద్‌, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ దాదాపుగా మూడేళ్లుగా జిల్లాలో సేవలు అందిస్తున్నారు. గత మూడుమాసాలుగా హైదరాబాద్‌ జిల్లాకు అదనపు సేవలు అందిస్తున్నారు. ఎటొచ్చి మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాకు ఏడాది కాలంలో పూర్తి స్థాయి కలెక్టర్‌ లేరు. ఏడాదికాలంగా మెదక్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌
ఇన్‌ఛార్జీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

మెదక్‌ జిల్లానుండి మేడ్చల్‌ జిల్లాకు రావాలంటే 60 కిలోమీటర్లకు పైగానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రద్దీగా ఉండే ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సుదూర ప్రాంతాలనుండి వచ్చే ప్రజలు నేరుగా కలెక్టర్లను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తుంటారు. వారికి తమ సమస్యలు చెప్పుకుంటేనే పరిష్కారమవుతాయనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. కీలక జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా ఉండటంతో కాస్త ఇబ్బందులు తప్పడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement