Tuesday, March 26, 2024

HYD: ఐటీ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ : కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రం ఐటీ రంగంలో దూసుకుపోతోంద‌ని, ఈ రంగంలో ఎంతో పురోగ‌తి సాధించామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. టీ హ‌బ్‌లో ఐటీ శాఖ 9వ‌ వార్షిక నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైద‌రాబాద్‌లో ఐటీ ఉత్ప‌త్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక ల‌క్ష 83 వేల కోట్ల ఐటీ ఎగుమ‌తుల‌కు చేరుకున్నామ‌ని తెలిపారు. రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో ఐటీ సెక్టార్‌లో 3 ల‌క్ష‌ల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 ల‌క్ష‌ల‌కు పైచిలుకు ఉద్యోగాలు క‌ల్పించామ‌ని గుర్తుచేశారు. ఐటీ రంగంలో బెంగ‌ళూరుతో పోటీ ప‌డేలా హైద‌రాబాద్‌ను నిల‌బెట్టామ‌ని చెప్పారు. క‌రోనా వ‌చ్చాక ఐటీ రంగంపై అనేక అపోహాలు వ‌చ్చాయి. ఐటీ రంగంలో కేంద్రం నుంచి స‌హ‌కారం ఏమీ లేదన్నారు. మాట సాయం త‌ప్ప కేంద్రం ఎలాంటి అండ‌దండ‌లు అందించ‌లేదన్నారు. యూపీఏ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు కేటాయిచిన ఐటీఐఆర్‌ను కూడా ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిందన్నారు. అయిన‌ప్ప‌టికీ నిల‌దొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగాన‌ నిల‌బెట్టామ‌ని కేటీఆర్ తెలిపారు.

ఐటీ రంగం దూసుకెళ్లేందుకు మా టీమ్ బాగా ప‌ని చేస్తోంద‌ని కేటీఆర్ ప్ర‌శంసించారు. వాషింగ్ట‌న్‌లో అనేక మంది పారిశ్రామిక‌వేత్త‌ల‌తో స‌మావేశమ‌య్యాన‌న్నారు. బెల్లంప‌ల్లిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రెండు వాషింగ్ట‌న్ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయని తెలిపారు. అనేక అమెరికా కంపెనీలు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతోందన్నారు. గూగుల్ కూడా హైద‌రాబాద్‌లో అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోందన్నారు. హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు జ‌ర్మ‌నీ కంపెనీ బాష్ ముందుకొచ్చింద‌ని కేటీఆర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంట‌ర్ హైద‌రాబాద్‌కు వ‌స్తోందన్నారు. లండ‌న్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కేంద్రం ఈ ఏడాది వ‌స్తుందన్నారు. మ‌రో రెండేళ్ల‌లో డ‌జోన్ ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ వ‌స్తోందన్నారు. అమెరికాకు చెందిన వార్న‌ర్ బ్ర‌దర్స్ డిస్క‌వ‌రీ హైద‌రాబాద్‌లో ఐడీసీ నిర్మిస్తోందన్నారు. వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, సిరిసిల్ల వంటి ప‌ట్ట‌ణాల‌కు కొత్త సంస్థ‌లు వ‌స్తున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. వ‌రంగ‌ల్‌కు టెక్ మ‌హీంద్రా, జెన్‌ప్యాక్ వంటి సంస్థ‌లు వ‌స్తున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోనూ కొన్ని సంస్థ‌లు త‌మ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. న‌ల్ల‌గొండ వంటి టైర్ 2 ప‌ట్ట‌ణాల‌కు ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement