Friday, April 19, 2024

భాగ్యనగరమా మేలుకో… మళ్లీ సేమ్ సీన్

హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరవాసులను అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా మునిగిన కాలనీలు.. నీటితో నిండిన ఇళ్లు, ఉప్పొంగిన డ్రైనేజీలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లో గతేడాది వరదలు వచ్చినప్పటి పరిస్థితే ఇప్పుడు మళ్లీ కనిస్తోంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 250పైగా కాలనీలు నీట మునిగాయి. చాలా చోట్ల ఇప్పటికే ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కసారిగా ఇండ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో కొందరు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు తమ ఇళ్లపైకి ఎక్కి రాత్రంతా భయం భయంగా గడిపారు.

గతేడాది వరదలు హైరాబాద్ నగరాన్ని ఏస్థాయిలో వణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. ఈసారి కూడా వరదలు అదే స్థాయిలో ఉంటున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్ పరిధిలో చెరువులు నిండి పొంగిపొర్లాయి. దీంతో కాలనీల్లోకి వరద ఉప్పొంగింది. గతేడాది అక్టోబర్​లో మాదిరే ఇప్పుడూ జనం ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్​మెట్, సరూర్ నగర్, హయత్ నగర్, ఉప్పల్, నాగోల్, బండ్లగూడ జాగీర్, మల్కాజిగిరి, బేగంపేట్, టోలిచౌకి, అత్తపూర్ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో ఇళ్లు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లలోనే ఉండిపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది బోట్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టారు. ఫుడ్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లను అందించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జీహెచ్ఎంసీ సహాయక చర్యలు ఆలస్యం కావడంతో జనం చాలా ఇక్కట్లు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎలాంటి సహాయక చర్యలు ప్రారంభించలేదు. దీంతో నగరవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement