Friday, April 26, 2024

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంద సీట్లు ప‌క్కా.. గులాబీ బాస్ ధీమా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మ‌న‌కు వంద సీట్లు ప‌క్కాగా వ‌స్తాయ‌ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు సాధించామ‌ని, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు ప‌క్కాగా గెలుస్తామ‌న్నారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్‌ కాదని, మునుపటికన్నా ఎక్కువ సీట్లు రావాలన్నదే ప్రాధాన్యత అంశమ‌న్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నామ‌న్నారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలిపామ‌న్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముందుకు సాగుతున్నామ‌న్నారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అకాల వర్షాలు రాక ముందే పంటకోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. దేశ జీఎస్‌డీపీలో వ్యవసాయరంగం వాటా 23శాతం ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అన్నారు. తెలివి ఉంటే బండమీద కూడా నూకలు పుట్టించుకోవచ్చన్నారు. కరెంటు, రోడ్డు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్యసంపద, ఇలా ప్రతీరంగంలో దేశమే ఆశ్చర్యపోయేలా ప్రగతిని తెలంగాణ నమోదు చేసిందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement