Wednesday, April 24, 2024

Hijab: సెక్యులర్‌ దేశంలో హిజాబ్‌ అనుమతించలేమ‌న్న సుప్రీంకోర్టు.. క‌ర్నాట‌క హైకోర్టు ఆదేశాల‌పై స‌మ‌ర్థ‌న‌

కర్నాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. లౌకిక దేశంలో మతపరమైన వస్త్రధారణను ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీల్లో డ్రెస్‌కోడ్‌పై ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది. హిజాబ్‌ నిషేధంపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. కేసు విచారణలో సుప్రీం న్యాయమూర్తికి, డిఫెన్స్‌ అడ్వకేట్‌కు మధ్య ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. హిజాబ్‌ ధరించడం హక్కని వాదిస్తున్న లాయర్‌తో వాదనలు అర్థరహితంగా ముగించవద్దు. బట్టలు వేసుకోవడమనే హక్కులోనే ధరించక పోవడం కూడా హక్కు ఉందని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా అన్నారు.

హిజాబ్‌ బ్యాన్‌ సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ, పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్షు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్లను విచారించింది. ఒక్క మతం నుంచే తలకు హిజాబ్‌ ధరించాలనే ఒత్తిడి వస్తోంది. ఇతర కమ్యూనిటీల విద్యార్థులు స్కూల్‌ డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తున్నారు. వారెవరూ తాము ఇది ధరిస్తాం, అది ధరించమని చెప్పడం లేదు కనుక సమస్య ఇక్కడే ఉందని న్యాయమూర్తి హేమంత్‌ గుప్తా అభిప్రాయ పడ్డారు.

కొంతమంది విద్యార్థులు రుద్రాక్షలు, క్రాస్‌లు మెడలో ధరిస్తున్నారని అడ్వకేట్‌ కుమార్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకు రాగా, ఎవరూ షర్టులు పైకి లేపి వాటిని చూడరని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మత పరమైన చిహ్నాలకు అవకాశం లేదని, మనది లౌకిక దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. హిజాబ్‌ వివాదం ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ ఉడిపి ప్రభుత్వ పీయు కళాశాలలో ప్రారంభమైంది.

ఆరుగురు విద్యార్థినులు హిజాబ్‌తో క్లాస్‌లోకి అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో హిజాబ్‌ ఆందోళన ప్రారంభమై, రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మారింది. దీనికి వ్యతిరేకంగా, హిందూ సంస్థలు, బీజేపీ కూడా ఆందోళన నిర్వహించింది. దీనిపై ముస్లిం విద్యార్థులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14,19 మరియు 25ల ప్రకారం హిజాబ్‌ ధరించే హక్కు ఉందని పిటిషన్‌ దాఖలు చేశాయి. అయితే వీరి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. 1983 ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ప్రకారం స్కూళ్లు, కాలేజీలపై ప్రభుత్వానికి అధికారం ఉందని, హిజాబ్‌పై బ్యాన్‌ విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement