Saturday, April 20, 2024

Heavy Rains: ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసర సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్టు అధికారులు వెల్లడించారు.

 కడప జిల్లాలోని రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. రాయచోటిలో 7 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  పలు గ్రామాలకు పాక్షికంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, టమోటా, బొప్పాయి, అరటి పంటలకు నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు అధికారులు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో తుఫాను కారణంగా సోమశిల జలాశయానికి భారీగా వరద పెరిగింది.. ఎగువ నుండి 46,945 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోగా, కృష్ణపట్నం కోస్ట్ గార్డ్స్ వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి  https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement