Thursday, April 25, 2024

హైదరాబాద్ లో మళ్లీ దంచికొట్టిన వర్షం… చెరువులుగా మారిన రోడ్లు

హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం కురిసింది. నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా? అనేలా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మలక్ పేట, చంచల్‌గూడ, చాదర్ ఘాట్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్‌, కాళీ మందిర్, అత్తాపూర్, మణికొండ, షేక్‌పేట, టోలిచౌకి, కోఠి, గోషామహల్, పురాణాపూల్‌, సైదాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడలో భారీ వర్షం పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటు మునిగాయి. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమ్యారు.

మరోవైపు ఈ వ‌ర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. మ‌ల‌క్‌పేట ప్ర‌ధాన ర‌హ‌దారిపై భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలో అక్క‌డ భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. ద్విచ‌క్ర వాహ‌నాలు వ‌ర్ష‌పు నీటిలో కొట్టుకుపోయాయి. మ‌ల‌క్‌పేట్‌లోని ఆయా కాల‌నీల్లోకి కూడా భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా, గ‌త రెండు, మూడు రోజుల నుంచి న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షం ధాటికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక చోట్ల పంటలు నీట మునిగాయి. వాగులు పొంగి పొర్లుతుండడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement