Thursday, April 25, 2024

చార్​ధామ్​ యాత్రికుల్లో గుండెపోటు మరణాలు.. ఫిట్​గా లేకుంటే రావొద్దంటున్న డాక్టర్లు

చార్​ధామ్​ యాత్రికుల్లో ఎక్కువగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. కరోనా బారిన పడ్డవారిలో ఆక్సిజన్​ లెవల్స్​ తక్కువగా ఉండడం ఒక కారణమైతే.. ఎత్తైన ప్రదేశాలు ఎక్కే కొద్దీ ఆక్సిజన్​ అందక ఇబ్బందులు పడతుంటారని ఇది కూడా మరణానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది మత విశ్వాసాలతో చార్​ధామ్​ యాత్రలో చనిపోతే మోక్షం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారని ఇది సరైనది కాదని అంటున్నారు. ఇప్పటికే చార్​ధామ్​ యాత్రలో అధికారికంగా  దాదాపు 48 మంది చనిపోయారు.

చార్​ధామ్​ యాత్రకు బయలుదేరిన యాత్రికులు మార్గమధ్యలో చనిపోతున్నారు. దీనికి గుండెపోటు ప్రధాన కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే.. ఉత్తరాఖండ్​లో ఈనెల 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు మార్గమధ్యలో అసువులుబాస్తున్నారు. ఇప్పటివరకు ఇట్లా దాదాపు 48 మంది దాకా చనిపోయినట్టు అక్కడి అధికారులు  వెల్లడిస్తున్నారు. అయితే.. అధిక రక్తపోటు, గుండెపోటు, పర్వతారోహణ వంటివి చార్​ధామ్​ యాత్రికుల మృతికి కారణాలుగా గుర్తించామని అధికారులు అంటున్నారు. దీనికంతటికీ కరోనా బారినపడడం కానీ, లేక శ్వాస సంబంధ వ్యాధులున్నా ఆక్సిజన్​ లెవల్స్​ సరిపోక.. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే కొద్దీ తగినంత ఆక్సిజన్​ అందక చనిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కాగా, ఇవ్వాల (శుక్రవారం) ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ వ్యవధిని ఒక నెల నుండి ఒక వారానికి తగ్గించినట్టు ANI వార్త సంస్థ తెలిపింది. ప్రయాణ మార్గాల్లో 20 చోట్ల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు ఉత్తరాఖండ్​ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలో యాత్రికుల కోసం ఒక సలహాను జారీ చేసింది. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికుల అసాధారణ రద్దీ కారణంగా హిమాలయ దేవాలయాలకు కష్టతరమైన ట్రెక్‌ను ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారిని కోరింది. రిషికేశ్‌తో పాటు ప్రయాణ మార్గాల్లోని వివిధ ప్రదేశాలలో యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఉత్తరాఖండ్ హెల్త్ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్ శైలజా భట్ తెలిపారు.

అయితే.. యాత్రికుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ వైద్యులను సంప్రదించిన తర్వాతే భక్తులు యాత్రకు బయలుదేరాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి చేశారు. చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో తక్కువ వనరులు ఉన్నందున ఆహారం, నీటికి సరైన ఏర్పాట్లు లేకపోతే తమ ప్రయాణాన్ని ప్రారంభించవద్దని సీఎం ప్రజలకు సూచించారు. పూర్తిగా ఆరోగ్యంగా లేని యాత్రికులు డాక్టర్ అనుమతి లేకుండా తీర్థయాత్రకు బయలుదేరకూడదు. వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తప్పనిసరిగా తమను తాము ఫిట్​గా ఉన్నారో లేదో చెక్​ చేసుకోవాలి” అని ధామి చెప్పారు.

కోవిడ్ -19 కారణంగా గత రెండేళ్లుగా తక్కువ మందికి పరిమితైమూన చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో యాత్రికులను ఆహ్వానిస్తోంది. ఆలయాలను సందర్శించే యాత్రికుల సంఖ్య కూడా చాలా రెట్లు పెరిగింది. మే 3న అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించడంతో యాత్ర ప్రారంభమైంది. మే 6న కేదార్‌నాథ్ తలుపు తెరుచుకోగా, మే 8న బద్రీనాథ్ తలుపులు తెరుచుకున్నాయి.

- Advertisement -

ఇటీవల ఉత్తరాఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి షాదాబ్ షమ్స్ ఒక వివాదాన్ని ఆశ్రయించారు. మత విశ్వాసాల కారణంగా కూడా యాత్రికులు మరణిస్తున్నారని, మోక్షాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. యాత్రను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని యాత్రికులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. యాత్రికుల మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం విజయవంతం కాలేదని కాంగ్రెస్ నేత గరిమా దాసౌనీ అన్నారు. మరణాలను ఆపడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం NDRF, ITBP సిబ్బందిని మోహరించాలని కోరారు.



Advertisement

తాజా వార్తలు

Advertisement