Saturday, April 20, 2024

కరోనా వ్యాక్సినేషన్.. ఆ రాష్ట్రాలు విఫలం!

కరోనా వ్యాక్సిన్ విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి, భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత లేదని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.

వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రతీ రాష్ట్రంతోనూ మాట్లాడుతున్నామని…వ్యాక్సిన్‌ అయిపోయే లోపు భర్తీ చేస్తున్నామని తెలిపారు. 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శుల సమావేశంలో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కొరత గురించి మాట్లాడిన మాట నిజమని అన్నారు. వారి దగ్గర స్టాక్‌ ఉన్నా..అయిపోతోందన్న ఆందోళనతో వారు కొరత ఉందని అంటున్నారని తెలిపారు. ఉత్పత్తిని బట్టి ఎప్పటికపుడు తాము పరిస్థితి అంచనా వేసి వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో తాము వ్యాక్సిన్‌ వేస్తాం.. రమ్మని కోరినా రాలేదన్నారు. ఇపుడు ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు వస్తున్నారని తెలిపారు. కరోనా కేసుల ఉధృతి విషయంలో ప్రజల నిర్లక్ష్యం చాలా ఉందన్నారు. ఈ విషయాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుని…కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం కారణంగానే కేసులు భారీగా పెరుగుతున్నాయని స్పష్టం చేశారు మంత్రి హర్షవర్ధన్. ఆయా రాష్ట్రాలు కోరిన సంఖ్యలో తాము కరోనా వ్యాక్సిన్లను పంపిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

కరోనా కట్టడిలో విఫలమైన కొన్ని రాష్ట్రాలు.. ప్రజల దృష్టిని మరల్చడానికి, వారిలో భయాందోళనలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలో 86 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమ తొలి డోసు ఇచ్చారని అన్నారు. ఢిల్లీలో 72 శాతం, పంజాబ్ లో 64 శాతం మందికి తొలి డోసు ఇచ్చారని విమర్శించారు. మిగత రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాల్లో 90 శాతం మందికిపైగా తొలి డోసు ఇచ్చాయని విమరించారు. మహారాష్ట్రలో కరోనా టీకాల కొరత ఉన్నట్లు కొందరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అర్హులకు సరిగా టీకాలు వేయకుండా, అందరికీ వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేస్తూ.. ప్రజల్లో భయాలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

దేశం కరోనాపై భీకర పోరు చేస్తోందని, మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంతో అది కాస్త నీరుగారిపోతోందని ధ్వజమెత్తారు. కరోనా వారియర్స్‌కు టీకాలు వేసే విషయంలో మహారాష్ట్ర సర్కార్ పనితీరు ఏమాత్రం గొప్పగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం నియమ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించి, ప్రజలను సంకట స్థితిలోకి నెట్టేశారని తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఛత్తీస్​గఢ్​లోని నాయకులు.. వ్యాక్సినేషన్​పై నిరంతరం వదంతులు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారని హర్షవర్ధన్ ఆరోపించారు. రాజకీయాలు మాని.. వైద్య మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని సూచించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందించాలని డిమాండ్‌ చేస్తున్న నాయకులపైనా హర్షవర్ధన్‌ మండిపడ్డారు. టీకా సరఫరాలో పరిమితులు ఉన్నంత కాలం ప్రాధాన్యక్రమంలోనే వ్యాక్సిన్‌ అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఇంకో మార్గం లేదన్నారు. ప్రస్తుతం 45 ఏళ్లపై బడిన వారికి వ్యాక్సిన్ కార్యక్రమం చరుక్కగా కొనసాగుతోందని హర్షవర్ధన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement