Friday, March 29, 2024

ఆదర్శనీయం.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిని

సర్కారు దవాఖాన అంటే సాధరణంగా ప్రజల్లో కొంత భయం ఉంటుంది. సరైన వసతులు ఉండక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవానికి వెళ్ళాలంటే జంకుతారు. సాధారణ , మధ్యతరగతి ప్రజలు అప్పొసప్పో చేసైనా సరే ప్రైవేటు దవాఖానలోనే ప్రసవించేందుకే మొగ్గుచూపుతున్న ఈ రోజుల్లో జిల్లా కేబినెట్‌ హోదా కలిగిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించి అందరికి ఆదర్శప్రాయంగా నిలిచింది.

భూపాలపల్లి , ప్రభన్యూస్‌ ప్రతినిధి : ప్రతి స్త్రీకి ప్రసవం పునర్జన్మతో సమానం అయినప్పటికి ఆ ప్రసవంలోనే బాధ్యతను ప్రదర్శించిన ప్రజాప్రతినిధి పై సర్వత్వ్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రం (వంద పడుకల) ఆస్పత్రిలో జయశంకర్‌ జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిని రాకేష్‌ సోమవారం రాత్రి ఆస్పత్రిలో అడ్మిట్‌ కాగా డాక్టర్‌ లావణ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.శ్రీదేవి, ఆనస్తీషియా శ్రీకాంత్‌, సూపరింటెండెంట్‌ జీడి తిరుపతి ఆధ్వర్యంలో డెలివరి చేయగా మంగళవారం ఉదయం 7.45గంటలకు ప్రసవించి పండంటి 3 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చి ఆదర్శ మాతృమూర్తిగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించి ప్రజారోగ్యానికి భరోసా కల్పిస్తూ ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రి పై మరింత నమ్మకం పెంచారు. ప్రజాప్రతినిధులు అంటే మాటాల్లో కాకుండా చేతల్లో చేయగలుగుతారని మరోసారి ప్రజానికానికి చాటిచెప్పారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్ధశ: జెడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి
సీఎం కేసీఆర్‌ తెరాస ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్ధశ వచ్చిందని , నాణ్యమైన వసతులు , అత్యుత్తమమైన వైద్య చికిత్స అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిని రాకేష్‌ అన్నారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో కార్పోరోట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు.పేద చ, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులు వరం అని అన్నారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ 1గా నిలుస్తుందన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇలాంటి వైద్య సదుపాయాలు అందించడానికి కృషి చేసి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రజలకు నమ్మకం పెంచేందుకు నేను కూడా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రసవానికి రావడం జరిగిందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు , సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ఎవరు అదైర్యపడకుండా ప్రభుత్వ ఆస్పతుల్లో సేవలను వినియోగించుకోవాలని జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిని కోరారు.

కేసీఆర్‌ కిట్‌ అందజేసిన సూపరింటెండెంట్‌
ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలు ప్రసవిస్తే వారికి అన్ని రకాల వస్తువులతో కూడాన సీఎం కేసీఆర్‌ కిట్‌కు అందజేస్తున్నారు. కాగా మంగళవారం మాతశిశు సంరక్షణ కేంద్రంలో జెడ్పీ ఛైర్మన్‌ ప్రసవించిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా జెడ్పీఛైర్మన్‌ జక్కు శ్రీహర్షినికి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జీడి తిరుపతి కేసీఆర్‌ కిట్‌ను అందజేశారు.


ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం: ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జీడి తిరుపతి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాతశిశు సంరక్షణ కేంద్రం ఆస్పత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాము. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తు రాష్ట్రంలోనే భూపాలపల్లి ఆస్పత్రిని నెంబర్‌1గా నిలిపేందుకు వైద్యలు, సిబ్బంది అందరం కృషి చేస్తున్నాము. ఇప్పటికే ఆస్పత్రిలో అనేక ప్రసవాలు జరిగాయి. మేము చేస్తున్న సేవలు గుర్తించి జెడ్పీఛైర్‌పర్సన్‌ కూడా ఇక్కడ ప్రసవానికి రావడం మాకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ప్రజలకు ఆస్పత్రి పై పూర్తి నమ్మకం ఏర్పడింది. నిరంతరం సేవలందించేందుకు మా వైద్య సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement