Saturday, April 20, 2024

స‌ర్కార్ కు ఆదాయం – పేద‌ల‌కు వ‌రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ రాబడికి తెలంగాణ ప్రభుత్వం స్కెచ్‌ వేస్తోంది. ఒకేసారి రూ. 20వేల కోట్లకుపైగా ఆదాయార్జననే కాకుండా ఒక్క దెబ్బతో నిరుపేదల దీర్గకాల సమస్యలకు ఉద్వాసన పలికేందుకు రెడీ అవుతోంది. త్వరలో నోటరీ, గ్రామ కంఠం సమస్యలకు చరగీతం పాడాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కొత్తగా అనుమతిలేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతించడంతోపాటు, ఇప్పటికే పురోగతిలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంలో వేగం పెంచి రాబడిని ఖజానాకు చేర్చాలని చూస్తోంది. అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ, నిరుపేదల ఇండ్లకు యాజమాన్య హక్కుల కల్పన, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణతో మరింత వెసులుబాటు కల్పించే దిశగా కృషి చేస్తోంది. వీటన్నింటితో భారీగా ఆదాయంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ యోచనగా ఉంది. త్వరలో నోటరీ యాజమానులకు హక్కుల కల్పనతోపాటుగా, ఒకేసారి గ్రామకంఠాల సమస్యలను తీర్చేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జీవో 58, జీవో 59ల పరిధిలోని భూముల క్రమబద్దీకరణ జోరుగా జరుగుతోండగా, అతి త్వరలో అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఇప్పటికే అసైన్డ్‌ చట్ట సవరణ దిశగా యోచించినా పలు ఇబ్బందుల నేపథ్యంలో ఆచరణ యోగ్యం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయార్జనలో భాగంగా పన్నేతర రాబడులపై సర్కార్‌ దృష్టిపెట్టింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు వేగవంతం చేస్తున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయంతో రూ. 6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తుండగా, మరోవైపు భూముల గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ. 1500కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌తో కూడా రాబడే…
లే అవుట్లలో ఇప్పటివరకు విక్రయించకుండా మిగిలిపోయిన ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉంటే అలాంటివారికి తాజా ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీటికి భవన నిర్మాణ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలతోపాటు 33శాతం కాంపౌండ్‌ ఫీజులను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. లే అవుట్ల క్రమబద్దీకరణతో పోల్చితో ఇవి మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన లే అవుట్లలో 1.31 లక్షల ప్లాట్లలో ఇంకా 40వేల ప్లాట్లు విక్రయించకుండా మిగిలిపోయాయి.

సొంతంగా లే అవుట్లతో రూ. వేల కోట్లు..
మరోవైపు ఇలా క్రమబద్దీకరణలతో ఆదాయార్జనకు వీలుండగానే ప్రభుత్వ భూముల విక్రయాలతో మరింత ఆదాయానికి ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్‌ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. ఈ ఏడాది పన్నేతర ఆదాయాల్లో భాగంగా భూముల అమ్మకాలతో రూ. 25,421కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు రూ. 8400కోట్ల రాబడే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పక్కనే ఉన్న ప్రైవేటు భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్‌ కింద 2500ఎకరాలతో రూ. 10వేల కోట్లను పొందేలా ప్లాన్‌ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్‌ భూములపై కూడా సర్కార్‌ దృష్టిసారించింది. వీటితో మరో రూ. 5వేల కోట్లను అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement